Brahmotsavam: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025..ఏ తేదీన ఏం జరుగుతుంది?
Brahmotsavam: ఈసారి సెప్టెంబర్ 24, 2025న ప్రారంభమై అక్టోబర్ 2, 2025న ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు స్వామివారి వైభవాన్ని, భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందిస్తాయి.

Brahmotsavam
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam)ఈసారి సెప్టెంబర్ 24, 2025న ప్రారంభమై అక్టోబర్ 2, 2025న ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు స్వామివారి వైభవాన్ని, భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఈ ఉత్సవాల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రహ్మోత్సవాల(Brahmotsavam) ప్రారంభం: అంకురార్పణ (సెప్టెంబర్ 23, 2025)
బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందుగా అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు సాయంత్రం 7:00 నుంచి 8:00 గంటల మధ్య విష్వక్సేన ఆరాధన , అంకురార్పణ జరుగుతాయి. ఇది ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు చేసే ఒక సంప్రదాయ ఆచారం.
మొదటి రోజు: ద్వజారోహణం (సెప్టెంబర్ 24, 2025)
ఈరోజు ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. సాయంత్రం 5:45 గంటలకు గరుడ ద్వజంను ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. దీనినే ద్వజారోహణం అంటారు. రాత్రి 9:00 నుండి 11:00 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు.

రెండవ రోజు: స్నపన తిరుమంజనం (సెప్టెంబర్ 25, 2025)
ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు స్వామివారు చిన్న శేష వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఈ సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. రాత్రి 7:00 నుండి 9:00 గంటల వరకు హంస వాహనంపై దర్శనమిస్తారు.
మూడవ రోజు (సెప్టెంబర్ 26, 2025)
ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు సింహ వాహనంపై, రాత్రి 7:00 నుంచి 9:00 గంటల వరకు ముత్యాల పల్లకీ వాహనంపై స్వామివారు ఊరేగుతారు.
నాలుగవ రోజు (సెప్టెంబర్ 27, 2025)
ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు కల్ప వృక్ష వాహనంపై, రాత్రి 7:00 నుంచి 9:00 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారు.
ఐదవ రోజు: గరుడ వాహనం (సెప్టెంబర్ 28, 2025)
బ్రహ్మోత్సవా(Brahmotsavam)లలో అత్యంత ముఖ్యమైన రోజు ఇది. ఉదయం 8:00 నుంచి 10:00 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 వరకు జరిగే గరుడ వాహన సేవ అత్యంత ప్రధానమైనది. ఈ వాహనంపై స్వామివారిని చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
ఆరవ రోజు: స్వర్ణ రథోత్సవం (సెప్టెంబర్ 29, 2025)
ఉదయం 8:00 నుంచి 10:00 గంటల వరకు హనుమంత వాహనంపై, రాత్రి 7:00 నుంచి 9:00 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. సాయంత్రం 4:00 నుండి 5:00 గంటల వరకు జరిగే స్వర్ణ రథోత్సవం ఈ రోజుకు ప్రత్యేక ఆకర్షణ.
ఏడవ రోజు (సెప్టెంబర్ 30, 2025)
ఉదయం 8:00 నుంచి 10:00 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7:00 నుంచి 9:00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు.
ఎనిమిదవ రోజు: రథోత్సవం (అక్టోబర్ 1, 2025)
ఈరోజు ఉదయం 6:00 గంటల నుంచి రథోత్సవం (భవ్య రథ యాత్ర) జరుగుతుంది. ఈ రథాన్ని భక్తులే స్వయంగా లాగుతారు. రాత్రి 7:00 నుంచి 9:00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారిని దర్శించుకోవచ్చు.
తొమ్మిదవ రోజు: చక్రస్నానం, ముగింపు (అక్టోబర్ 2, 2025)
బ్రహ్మోత్సవాల చివరి రోజు ఇది. తెల్లవారుజామున 3:00 నుంచి 6:00 గంటల వరకు పల్లకీ ఉత్సవం , తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి. ఉదయం 6:00 నుంచి 9:00 గంటల వరకు జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగింపునకు వస్తాయి. సాయంత్రం 7:00 గంటలకు ద్వజావరోహణంతో ఉత్సవాలు అధికారికంగా ముగుస్తాయి.