Karthika Somavaram : కార్తీక సోమవారాల శక్తి ఏంటో తెలుసా? శివుడి అనుగ్రహం కోసం 4 సోమవారాలు ఏం చేయాలి?
Karthika Somavaram : కార్తీక సోమవారం ఉపవాసాలు ఎందుకు చేయాలి? కార్తీక మాసంలో శివారాధన విశేషాలు ,శివలింగానికి అభిషేకాలు, ఉపవాస నియమాలేంటో చూద్దాం.
Karthika Somavaram
తెలుగువారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతీ ఏడాది వచ్చే కార్తీక మాసానికి ఉండే ప్రత్యేకతే వేరన్న విషయం తెలిసిందే. ఈ పవిత్ర మాసంలో ప్రతి సోమవారాని(Karthika Somavaram)కి కూడా అత్యంత శక్తివంతమైన ప్రాధాన్యత, దైవిక వైభవం ఉంటాయి. సోమవారం రోజు అంటేనే లయకారకుడైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా మన పురాణాలు, ఆచారాలు స్పష్టంగా చెబుతున్నాయి.
అందుకే ఈ ప్రత్యేకమైన రోజుల్లో కఠినమైన నిష్టతో, భక్తిశ్రద్ధలతో రోజంతా ఉపవాసం పాటిస్తూ దగ్గరలోని శివాలయాలను పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. వేకువజామునే లేచి తలస్నానం చేసి ఆలయానికి చేరుకుని, శివలింగానికి ఆవు పాలు, స్వచ్ఛమైన జలాలతో పాటు బిల్వదళాలతో అభిషేకం నిర్వహిస్తారు.
మరికొందరు ప్రత్యేకంగా రుద్రాభిషేకం, మహాన్యాస పూర్వక అభిషేకాలను ప్రత్యేకంగా చేయించుకుంటారు. ఈ మాసంలో ఆలయ ప్రాంగణంలో శివపంచాక్షరి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, అలాగే శివ సహస్రనామ పారాయణం చేయడం వల్ల మనసులోని భయాలు, అనవసరమైన అశాంతి పూర్తిగా తొలగిపోయి అంతులేని ప్రశాంతత దొరుకుతుంది.
కార్తీక సోమవారం(Karthika Somavaram) రోజు ఉపవాసం ఉండటం వల్ల శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక బలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఎవరి శరీర తత్వానికి, ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టు వారు రోజంతా కఠిన ఉపవాసం ఉండటం లేదా ఒంటిపూట భోజనం చేయడం వంటి నిబంధనలను పాటిస్తారు.
ఇక ఈ ఏడాది 2026లో రాబోతున్న కార్తీక మాసంలో మొత్తం 4 సోమవారాలు వస్తున్నాయి. నవంబర్ 16వ తేదీ, నవంబర్ 23వ తేదీ, నవంబర్ 30వ తేదీ అలాగే డిసెంబర్ 7వ తేదీల్లో ఈ ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పవిత్రమైన సోమవారం రోజుల్లో శివుడిని భక్తితో కొలవడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలతో నిండిపోతాయని.. అలాగే సర్వపాపాలు హరిస్తాయని పెద్దలు చెబుతుంటారు.
ప్రతి సోమవారం సాయంత్రం శివాలయాల్లో జరిగే దీపోత్సవాలు, కార్తీక పురాణ పఠనం భక్తులకు సరికొత్త దివ్యమైన అనుభూతిని పంచుతాయి. అలా ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి. భోళా శంకరుడిని కార్తీక మాసంలో కొలిచే ఈ విధానం మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Office Politics : ఆఫీస్ పాలిటిక్స్.. ఆఫీసులో ఉండే ఆ 4 రకాల మనుషులు మీ దగ్గరా ఉన్నారా?





