Just Andhra PradeshJust PoliticalLatest News

Compassionate Appointments:ఇకపై వారసత్వ ఉద్యోగాలు ఉండవు.. కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు తీర్పుపై రచ్చ

Compassionate Appointments: ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే.. మరోవైపు అర్హతలతో ఏమాత్రం సంబంధం లేకుండా కారుణ్య నియామకాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతుండటంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Compassionate Appointments

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎంతో కీలకంగా ఉంటున్న కారుణ్య నియామకాల (Compassionate Appointments) పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే.. మరోవైపు అర్హతలతో ఏమాత్రం సంబంధం లేకుండా కారుణ్య నియామకాలు(Compassionate Appointments) మాత్రం రోజురోజుకు పెరిగిపోతుండటంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

అంతేకాదు కారుణ్య నియామక వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ మూడు నెలల గడువునిస్తూ.. కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20,801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సగటున ఏడాదికి 2 వేల మందిని కారుణ్య నియామకాల పద్ధతిలో నియమిస్తున్నారని, ఇది ప్రతీ ఏడాది ప్రభుత్వం జరిపే సాధారణ నియామకాల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పోల్చి చెప్పింది.

ముఖ్యంగా ఈ విషయంలో కొన్ని అంశాలను హైకోర్టు ఎత్తి చూపింది. కారుణ్య నియామకం అనేది ఒక హక్కు కాదని అంటే అవి వారసత్వ ఉద్యోగాలు కావని, అది కేవలం ఆపదలో ఉన్న ఒక కుటుంబానికి ఇచ్చే ఊరట మాత్రమేనని స్పష్టం చేసింది. కొందరు ఒకే కుటుంబం నుంచి మూడో తరం వారు కూడా ఈ కోటా లోనే ఉద్యోగాలు పొందుతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
దీని కోసం ఉద్యోగి మరణించిన వెంటనే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందా లేదా అనేదే మెయిన్‌గా చూడాలి. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే కారుణ్య నియామకానికి అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.

సాధారణంగా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మాత్రమే కారుణ్య నియామకాల(Compassionate Appointments)లో ఆధారపడిన వారి కిందకు వస్తారు. కానీ, ఉద్యోగాల కోసం సోదరులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు కూడా క్లెయిమ్ చేయడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనికోసం హైకోర్టు కొత్త ప్రతిపాదనలు సూచించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉద్యోగానికి బదులు ఒకేసారి భారీ మొత్తంలో ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లించాలని సూచించింది. మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీసును బట్టి ఈ మొత్తాన్ని లెక్కించాలని క్లారిటీ ఇచ్చింది.

కుటుంబానికి తప్పనిసరిగా ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం, రెగ్యులర్ ఉద్యోగానికి బదులు ఔట్ సోర్సింగ్ కానీ తాత్కాలిక ప్రాతిపదికన కానీ వారికి ఉపాధి కల్పించాలని చెప్పింది.

పర్మినెంట్ ఉద్యోగం కల్పించడమనేది కేవలం అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరగాలని చెప్పిన హైకోర్ట్ అది కూడా ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపింది.

కాగా ఈ కారుణ్య నియామక పథకం అనేది మనదేశంలో 1950ల నుంచి అమలులో ఉంది. సర్వీసులో ఉండగా ఉద్యోగి అకాల మరణం పాలయితే, ఆ కుటుంబం వీధిన పడకుండా చూడటమే కారుణ్య నియామక పథకం ప్రధాన ఉద్దేశ్యం. అయితే, కాలక్రమేణా దీనివల్ల మెరిట్ ఉన్న అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీస్తున్నట్లుగా విమర్శలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే పలు తీర్పుల్లో కారుణ్య నియామకమనేది 5% కోటాకు మించకూడదని, ఇది ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సుప్రీం తీర్పులను ఉటంకిస్తూ ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా తాజా ఆదేశాలిచ్చింది.

Compassionate Appointments
Compassionate Appointments

మరోవైపు తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ కారుణ్య నియామకాల(Compassionate Appointments)పై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే గరిష్ట వయోపరిమితి , ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్‌ను విధిస్తూ జీవోలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా హర్యానా వంటి రాష్ట్రాల్లో ఉద్యోగానికి బదులుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సాయం పథకానికే మొగ్గు చూపుతున్నారు.

మొత్తంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ మూడు నెలల గడువు లోపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.. రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు,లక్షలాది మంది నిరుద్యోగులపై ప్రభావం చూపించబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగస్థుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేక గళం బలంగా వినిపించే అవకాశం కనిపిస్తోంది.

Aakakarakaya : ఆకాకరకాయలను లైట్ తీసుకోకండి.. రుచే కాదు డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలోనూ ది బెస్ట్..

Related Articles

Back to top button