Bhogapuram Airport : ఆగస్టు 1 నుంచి భోగాపురం రన్ వే సిద్ధం..ఉత్తరాంధ్రకు పండగే కానీ ప్రయాణం భారమవ్వాల్సిందేనా?
Bhogapuram Airport : విశాఖ సిటీలో ఉన్నవారు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటే 40 - 50 కి.మీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.
Bhogapuram Airport
ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కు అత్యంత కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్(Bhogapuram Airport) ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ ఎయిర్పోర్ట్, ఈ విశాఖ ఆర్థిక, పర్యాటక చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.
అయితే సిటీకి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించడమే ఇప్పుడు అసలు చర్చకు దారితీస్తోంది. ఇది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కు ప్లస్ అవడంతో పాటు.. రోజువారీ ప్రయాణికులకు భారంగా మారుతుందంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలో నేషనల్ హైవే 16కు దగ్గరలో దాదాపు 2,200 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ రేంజ్ ఫెసిలిటీలతో ఈ ఎయిర్‌పోర్టును కళ్లు జిగేల్మనిపించేలా తీర్చిదిద్దారు. రోజూ 200కు పైగా విమానాలను హ్యాండిల్ చేయడంతో పాటు, భారీ వైడ్ బాడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండింగ్, టేకాఫ్‌లకు సరిపోయేలా పొడవైన రన్‌వేను కూడా నిర్మించారు.
కేవలం ప్యాసింజర్ టెర్మినల్ మాత్రమే కాకుండా కార్గో హబ్, ఫ్లైట్స్ మరమ్మత్తుల కోసం ఎంఆర్ఓ సదుపాయం, ఏరో సిటీ లాంటి భారీ ప్లాన్లతో దీన్ని రూపుదిద్దారు. విశాఖపట్నం, భోగాపురం, గంగవరం పోర్టులు, పారిశ్రామిక కారిడార్లను ఒకే క్లస్టర్‌గా కనెక్టివిటీ చేయాలన్నదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
అయితే గతంలో విశాఖ ఎయిర్‌పోర్టు పూర్తిగా నౌకాదళం (INS Dega) కంట్రోల్లో ఉండటం వల్ల సివిలియన్ ఫ్లైట్లకు చాలా ఆంక్షలు ఉండేవి. కొత్త ఫ్లైట్లు పెంచాలన్నా, చివరకు రాత్రి వేళల్లో సర్వీసులు నడపాలన్నా కూడా నేవీ పర్మిషన్లు తప్పనిసరి అయ్యేవి. కానీ ఇప్పుడు భోగాపురం పూర్తిగా సివిల్ ఏవియేషన్ పరిధిలోకి రావడంతో ఆ సమస్యలన్నీ తీరిపోయినట్లే అవుతుంది.
ఫ్లైట్స్ అన్నీ భోగాపురం వైపు మళ్లడం వల్ల నౌకాదళానికి సెక్యూరిటీ రిస్క్, ట్రాఫిక్ భారం పూర్తిగా తగ్గిపోతాయి. ఇకపై నేవీ తమ ఆపరేషన్లను స్వేచ్ఛగా చూసుకోవచ్చు. అలాగే ఇటు భోగాపురంలో పగలు-రాత్రి అనే తేడా లేకుండా మరిన్ని ఫ్లైట్లను నడుపుకోవచ్చు. ఒకప్పుడు ఎక్స్ట్రా ఫ్లైట్ కోసం నేవీ క్యాలెండర్ వైపు చూసే రోజులకు తెరపడుతూ, దేశ భద్రతకు ఎలాంటి భంగం కలగకుండానే ఉత్తరాంధ్ర ఏవియేషన్ రంగానికి భోగాపురం పూర్తి స్వేచ్ఛను ఇస్తోంది.
అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ (Bhogapuram Airport)పూర్తి అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం విశాఖలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఏమవుతుందనే దానిపై ఇంకా అఫీషియల్‌గా పూర్తి క్లారిటీ రాలేదు. కాకపోతే ఇంటర్నేషనల్ సర్వీసులు, ఎక్కువ ట్రాఫిక్ ఉండే సర్వీసులన్నీ కూడా భోగాపురం వైపే మళ్లుతాయని తెలుస్తోంది. సిటీలో ఉన్న పాత ఎయిర్‌పోర్టును డిఫెన్స్ అవసరాలకు, పరిమిత డొమెస్టిక్ విమానాలకు లేదా స్పెషల్ చార్టర్డ్ సర్వీసులకే పరిమితం చేసే ఛాన్స్ ఉంది.
సిటీకి దూరంగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు ముఖ్యంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనే చెప్పొచ్చు. విశాఖ సిటీ మధ్యలో ఉన్న ఎయిర్‌పోర్టును విస్తరించడానికి ప్లేస్ లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. కానీ భోగాపురంలో పుష్కలంగా ఉన్న స్థలం వల్ల ఫ్యూచర్లో రెండో రన్‌వే, భారీ ఏరో సిటీ, లాజిస్టిక్స్ పార్కులను నిర్మించుకోవచ్చు. సిటీ వాసులకు ఎలాంటి విమానాల శబ్ద కాలుష్యం ఉండదు. ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఎయిర్-సీ కారిడార్ ఈజీగా మారుతుంది.
అయితే నాణేనికి రెండో వైపులాగా దీనిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. విశాఖ సిటీలో ఉన్నవారు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటే 40 – 50 కి.మీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల కనీసం గంటన్నర టైమ్, క్యాబ్ ఖర్చులు ఎక్స్ట్రా భరించాల్సి వస్తుంది.

బిజినెస్ ట్రావెలర్స్, ఎమర్జెన్సీ టైమ్‌లో జర్నీ చేసేవారికి సిటీలో ఉన్న సదుపాయం దూరమవుతుంది. గవర్నమెంట్ కనుక సరైన ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రో , ఫాస్ట్ బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ ప్రయాణం నరకప్రాయంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్(Bhogapuram Airport) ద్వారా ఉత్తరాంధ్రలో విదేశీ పెట్టుబడులు, టూరిజం, ఎంప్లాయ్మెంట్ పెరిగి ప్రాంతీయంగా విపరీతమైన డెవలప్మెంట్ జరిగే ఛాన్స్ ఉందనడంలో సందేహం లేదు. జర్నీ టైమ్, కనెక్టివిటీ సమస్యలను కూటమి ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుందనే దానిపైనే ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విజయం ఆధారపడి ఉంది.
Balakrishna : ఏఐజీ హాస్పిటల్లో బాలయ్య..హెల్త్ బులెటిన్ విడుదల





