Loan :ఆ మహిళలకు బంపర్ ఆఫర్..2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్..
Loan:స్త్రీ నిధి ద్వారా ఒక్కో మహిళకు లక్ష రూపాయల వరకు లోన్ లభిస్తుండగా..బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న ఆసక్తి ఉన్నవాళ్లకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది.
Loan
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలను కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సాధికారతకు కొత్త అర్థాన్ని ఇస్తూ, వారి ఆర్థిక ఎదుగుదలకు భారీగా బాసటగా నిలుస్తోంది. గతంలో ఉన్న లోన్(Loan) లిమిట్‌ను పెంచుతూ, ఎటువంటి హామీ లేకుండానే లక్షలాది రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రస్తుతం ఏపీలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. స్త్రీ నిధి ద్వారా ఒక్కో మహిళకు లక్ష రూపాయల వరకు లోన్(Loan) లభిస్తుండగా..బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న ఆసక్తి ఉన్నవాళ్లకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం, స్త్రీ నిధి ద్వారా అందే రూ. 2 లక్షలతో పాటు, అదనంగా మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ. 3 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశాన్ని కల్పించింది.
కేవలం 11 శాతం వడ్డీతో లభించే ఈ రుణాలను, దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఒకటిన్నర లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏకంగా రూ. 3 వేల కోట్లు కేటాయించింది.
అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు ఉన్నతి పథకం ద్వారా అదనంగా మరో రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణాన్ని కూడా అందిస్తోంది.
అంటే, వీరికి లభించే మొత్తం ఆర్థిక సాయం రూ. 4 లక్షలకు చేరుతుంది. అంతేకాకుండా, అన్ని వర్గాల మహిళలకు అవసరమైతే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద మరో రూ. లక్ష ఎక్కువగా పొందే అవకాశం కూడా ఉంది. అయితే, ఈ రుణ సదుపాయం పొందాలంటే మహిళలు డ్వాక్రా సంఘంలో సభ్యులై ఉండటంతో పాటు, గతంలో తీసుకున్న రుణాలను రెగ్యులర్‌గా చెల్లించిన రికార్డును కలిగి ఉండాలి.

ఈ భారీ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పకడ్బందీగా ఎంపిక ప్రక్రియను చేపడుతోంది. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు సెర్ప్ అధికారులు గ్రామాల్లోని ప్రతీ సంఘాన్ని సందర్శించడానికి రెడీ అవుతున్నారు. గ్రామ సమాఖ్య పరిధిలో ఇప్పటికే చిన్నపాటి వ్యాపారాలు చేస్తున్న వారు లేదా కొత్తగా యూనిట్లు ప్రారంభించాలనుకునే మహిళలను అధికారులు గుర్తిస్తారు.
ప్రతి గ్రామ సంఘం (VO) నుంచి ముందుగా 15 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కేవలం లోన్ (Loan)ఇవ్వడానికే పరిమితం కాకుండా, మహిళలు తమ సొంత కాళ్లపై తాము నిలబడి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని డ్వాక్రా మహిళలు అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చినట్లు అయింది.
Bank Accounts:ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే లాభమా? నష్టమా? ఆర్బీఐ ఏమంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?





