Cyclone : బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో దూసుకొస్తున్న మరో తుపాను..
Cyclone : ఏపీని అర్నబ్ తుపాను ముంచెత్తి రూ. 4,600 కోట్ల నష్టం మిగిల్చిందన్న ఆవేదన నుంచి కోలుకోకముందే, బంగాళాఖాతంలో మరో కొత్త తుపాను సూచనలు కనిపిస్తున్నాయి.
Cyclone
అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు ఇంకా పూర్తిగా తేరుకోనే లేదు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమవడమే కాకుండా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఏకంగా రూ. 4,600 కోట్ల ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చేదు జ్ఞాపకాల నుంచి జనాలు బయటపడక ముందే, ఏపీ తీరాన్ని దెబ్బతీయడానికి మరో ప్రకృతి వైపరీత్యం దూసుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
బంగాళాఖాతంలో మళ్లీ ఒక బలమైన అల్పపీడనం(Cyclone) రూపుదిద్దుకుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది రేపటికల్లా అంటే అక్టోబర్ 31వ నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందడంతో పాటు ఆ తర్వాతి కొద్ది గంటల్లోనే తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ కొత్త విపత్తు ధాటికి ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా నవంబర్ 1 నుంచి 3వ తేదీల మధ్య శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు వర్షాలు ఆటంకం కలిగిస్తాయన్న టెన్షన్లో అభ్యర్థులు ఉన్నారు.
ఇటు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ముసురు కమ్మేసి వర్షాలు కూడా మొదలయ్యాయి. అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కూడా ఈరోజు అక్కడక్కడా కొద్దిపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. వర్షాల ధాటికి వంశధార, నాగావళి నదులన్నీ భయంకరంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.





