Pakistan : బంగాళాఖాతంలో దాయాది కొత్త వ్యూహం.. ఘాజీ పరాభవం తర్వాత మళ్లీ పాక్ కుయుక్తులు ఎందుకు?
Pakistan : అప్పట్లో ఇండియన్ నావికాదళం కొట్టిన దెబ్బకు పశ్చిమ తీరానికే పరిమితమైన పాకిస్తాన్ నేవీ, ఇప్పుడు చైనా అండ చూసుకుని మళ్లీ భారతదేశానికి అత్యంత కీలకమైన తూర్పు తీరంపైన కన్నేసింది
Pakistan
సముద్రం ఎప్పుడూ పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ దాని అడుగున ఎప్పుడూ కూడా ఎవరూ గుర్తించని ఒక నిశ్శబ్ద యుద్ధం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక సముద్ర వ్యూహంతోనే.. 1971 ఇండియా ,పాకిస్తాన్(Pakistan) యుద్ధంలో విశాఖపట్నం తీరంలో పీఎన్ఎస్ ఘాజీ అనే తన గర్వకారణమైన జలాంతర్గామిని కోల్పోయిన పాక్..సుమారు ఐదున్నర దశాబ్దాల తర్వాత మరలా బంగాళాఖాతంలోకి అడుగుపెట్టడానికి పావులు కదుపుతోంది.
అప్పట్లో ఇండియన్ నావికాదళం కొట్టిన దెబ్బకు పశ్చిమ తీరానికే పరిమితమైన పాకిస్తాన్(Pakistan) నేవీ, ఇప్పుడు చైనా అండ చూసుకుని మళ్లీ భారతదేశానికి అత్యంత కీలకమైన తూర్పు తీరంపైన కన్నేసింది. రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లో ఇండియాతో సన్నిహితంగా ఉండే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, అక్కడ పాకిస్తాన్ అనుకూల శక్తులు బలపడటాన్ని ఆసరాగా చేసుకున్న పాకిస్తాన్.. బంగాళాఖాతంలో తన సైనిక ఉనికిని పెంచుకోవడానికి రహస్యంగా పావులు కదుపుతోంది.
పాక్ కొత్త వ్యూహానికి మెయిన్ బలం చైనా నుంచి అందుతున్న లేటెస్ట్ హంగోర్-క్లాస్ జలాంతర్గాములే. చైనా తయారుచేసిన టైప్-039బీ యువాన్ క్లాస్ బేస్ చేసుకుని రూపుదిద్దుకున్న ఈ 8 సబ్‌మెరైన్లలో మొదటిది ఇప్పటికే పాకిస్తాన్ నౌకాదళానికి చేరింది.
ఈ జలాంతర్గాముల స్పెషాలిటీ ఏంటంటే.. ఇవి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే, ఇప్పటి వరకూ ఉన్న డీజిల్ సబ్‌మెరైన్లలా బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవడానికి.. డైలీ నీటి మీదకు రాకుండా, వారాల తరబడి సముద్రం అడుగున ఇవి దాగి ఉండిపోగలవు.
శ్రీలంకలో దీనిపై మాట్లాడిన పాక్ నావికాదళ అధికారి ఒకరు.. ఈ హంగోర్ సబ్‌మెరైన్లు తమకు గేమ్‌ఛేంజర్ అని అన్నారు. వీటి ద్వారా బంగాళాఖాతంలో కూడా తమ సైనిక శక్తిని విస్తరిస్తామని బహిరంగంగానే ప్రకటించారంటేనే వీరి తెగువను ఎవరి అండను చూసుకుని ఇలా స్టేట్మెంట్ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక్కడ మనమంతా గమనించాల్సిన లోతైన విషయం ఏంటంటే.. ఈ వ్యూహం వెనుక కేవలం పాక్ మాత్రమే లేదని.. భారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టాలనే చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ కుట్ర అని స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు బంగ్లాదేశ్‌లో 2024 జులైలో తలెత్తిన ఎవరూ ఏ మాత్రం ఊహించని పొలిటికల్ మార్పులు పాకిస్తాన్‌కు బాగా కలిసి వచ్చాయి.
1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్(Pakistan), బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కానీ బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ రెండు దేశాల మధ్య స్నేహం మళ్లీ చిగురించింది. డైరెక్టుగా సముద్ర వాణిజ్యం ప్రారంభమవ్వడమే కాకుండా.. 2024 నవంబరులో పాకిస్తాన్ యుద్ధనౌక పీఎన్ఎస్ సైఫ్ బంగ్లాదేశ్‌లోని ఛట్టోగ్రామ్ తీరంలో నాలుగు రోజుల పాటు మోహరించడమే దీనికి ఉదాహరణ.
ఈ భౌగోళిక రాజకీయ మార్పుల (Geopolitical shifts) ఆధారంగానే బంగాళాఖాతంలో పాకిస్తాన్ జలాంతర్గాముల సంచారానికి బంగ్లాదేశ్ సపోర్ట్ దొరికే అవకాశం ఉందనేది అర్ధం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ప్రాక్టికల్‌గా చూస్తే బంగాళాఖాతంలో భారత్ ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయడం పాకిస్తాన్‌కు అంత ఈజీ ఏం కాదు. విశాఖ కేంద్రంగా ఉన్న భారత తూర్పు నావికాదళ కమాండ్ వ్యూహాత్మకంగా చాలా బలమైనది. భారతదేశపు అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖపట్నంలోనే ఉంది.
అన్నింటికంటే ఇంపార్టెంట్‌ది సముద్ర గర్భంలో దాగి ఉన్న ఎలాంటి శత్రు జలాంతర్గామినైనా క్షణాల్లో గుర్తించి..దానిని వేటాడగల అమెరికా తయారీ బోయింగ్ పీ-8ఐ పోసిడాన్ నిఘా విమానాలు, యుద్ధనౌకలపై ఉండే ఎంహెచ్-60ఆర్ రోమియో హెలికాప్టర్లు భారత్ నావికాదళం వద్ద రెడీగా ఉన్నాయి.

అంతేకాకుండా కరాచీ బేస్ నుంచి బంగాళాఖాతానికి ఉన్న డిస్టెన్స్ వల్ల, కంటిన్యూస్‌గా సరఫరా (Logistics) , ఇంధనం అందించే మిత్రదేశాల సాయం లేకుండా పాకిస్తాన్ సబ్‌మెరైన్లు భారత్‌లో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవు.
కాబట్టి పాకిస్తాన్(Pakistan) చేస్తున్న ఈ కొత్త కుయుక్తులు ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచినా సరే.. భారత నావికాదళం ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన నిఘా వలయాన్ని దాటుకొని మరీ బంగాళాఖాతంలో దాయాది ఆటలు సాగడం ఏమాత్రం సాధ్యం కాదనే చెప్పాలి.
Telegram : సమాజానికి ముప్పుగా మారిన టెలిగ్రామ్..ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదనలు





