Srivari Salakatla Brahmotsavam : తిరుమలలో పవిత్ర చక్రస్నాన ఘట్టం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు..
Srivari Salakatla Brahmotsavam : సెప్టెంబర్ 15వ తేదీన మొదలైన ఏడుకొండలవాడి ఆధ్యాత్మిక వేడుకలు సెప్టెంబర్ 23వ తేదీ వరకు భక్తకోటిని మైమరపించాయి.
Srivari Salakatla Brahmotsavam
తిరుమల గిరులపై తొమ్మిది రోజులుగా అత్యంత వైభవంగా సాగిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Srivari Salakatla Brahmotsavam) బుధవారం రోజు పవిత్ర చక్రస్నానంతో కన్నులపండువగా ముగిశాయి. సెప్టెంబర్ 15వ తేదీన మొదలైన ఏడుకొండలవాడి ఆధ్యాత్మిక వేడుకలు సెప్టెంబర్ 23వ తేదీ వరకు భక్తకోటిని మైమరపించాయి.
చివరి రోజు తిరుమలలో శోభాయమానంగా జరిగిన చక్రస్నాన ఘట్టంలో సుదర్శన చక్రత్తాళ్వార్ శ్రీవారి పుష్కరిణిలో మునక వేయగానే.. శేషాచలం కొండలు గోవిందా.. గోవిందా అంటూ శ్రీవారి నామస్మరణలతో భక్తి పారవశ్యంతో మారుమోగిపోయాయి.
ముగింపు రోజు వేడుకలు బుధవారం తెల్లవారుజాము నుంచే అత్యంత వైభవంగా మొదలయ్యాయి. వేకువజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య స్వామివారికి సర్వభూపాల పల్లకి ఉత్సవం నిర్వహించారు.
ఆ తర్వాత శ్రీ భూవరాహ స్వామి ఆలయ ప్రాంగణంలో.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి , సుదర్శన చక్రత్తాళ్వార్‌కు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని గావించారు. పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, గంధం,పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించగా, వేద పండితుల పంచ సూక్తాల మంత్రోచ్ఛారణలతో పాటు, జీయర్ స్వాముల దివ్య ప్రబంధ పారాయణం పటించడంతో తిరుమలలో దివ్యానుభూతిని పంచాయి.
ఆ తర్వాత పుష్కరిణి వద్దకు సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లి వేద మంత్రాల ఘోష నడుమ పవిత్ర జలాలలో స్నానం చేయించారు. అదే ముహూర్తంలో ఘాట్ల వద్ద అంతవరకూ వేచి ఉన్న వేలాది మంది భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ చక్రస్నానం వల్ల ఉత్సవ నిర్వహణలో ఏవైనా లోటు పాట్లు ఉంటే అవన్నీ తొలగిపోయి, లోకానికి సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కలుగుతాయని పండితులు విశ్వసిస్తారు.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు(Srivari Salakatla Brahmotsavam) అత్యంత విజయవంతం కావడంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గైడెన్స్‌తో 8 రోజుల్లో ఏకంగా 5.76 లక్షల మంది భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనాన్ని కల్పించామని తెలిపారు. ఈ మహాత్కార్యంలో శ్రమించిన అర్చకులు, అధికారులు, పోలీసులు, శ్రీవారి సేవకులకు పేరుపేరున బీఆర్ నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు.
Banks Open Sunday : కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఈ ఆదివారం రోజు బ్యాంకులు ఓపెన్..





