Train Passengers: రైలు ప్రయాణికులకు శుభవార్త వినిపించిన కేంద్రం..
Train Passengers : రైలు ప్రయాణం మొదలయ్యే చోట కానీ ముగిసే చోట ఆ ట్రైన్‌ను శుభ్రం చేయడంతో పాటు, సాంకేతిక తనిఖీలు అంటే మెయింటెనెన్స్ చేయడం చాలా అవసరం.
Train Passengers
ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు(Train Passengers), రైల్వే వ్యవస్థకు భారీ ఊరటనిస్తూ.. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలోని ప్రధాన నగరాల్లో రద్దీని తగ్గించి, రైళ్ల నిర్వహణను మరింతగా వేగవంతం చేయడానికి.. 4 మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం కాగా, కూటమి ప్రభుత్వం కూడా భూసేకరణకు సానుకూలంగా స్పందించింది.దీంతో ఈ మెగా టెర్మినల్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటనే చర్చ సాగుతుంది.
మెగా టెర్మినల్స్ ఎందుకు అవసరం అంటే.. సాధారణంగా ఒక రైలు ప్రయాణం(Train Passengers) మొదలయ్యే చోట కానీ ముగిసే చోట కానీ ఆ ట్రైన్‌ను శుభ్రం చేయడంతో పాటు, సాంకేతిక తనిఖీలు అంటే మెయింటెనెన్స్ చేయడం చాలా అవసరం.
ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్స్ అన్నీ కూడా రైళ్లతో నిండిపోవడం వల్ల.. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం , ఉన్న ట్రైన్స్‌ను సరైన సమయానికి నడపడం కష్టమవుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికే ఇప్పుడు ప్రధాన స్టేషన్లకు దగ్గరలో ఈ మెగా టెర్మినల్స్ నిర్మిస్తారు.

రైల్వే శాఖ ప్రణాళికల ప్రకారం.. ఈ నాలుగు టెర్మినల్స్ కింది ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి.
విశాఖపట్నం (జగన్నాథపురం).. విశాఖ నగరంలోని ప్రధాన స్టేషన్‌పై భారాన్ని తగ్గించడానికి… సబ్బవరం మండలం జగన్నాథపురం వద్ద భారీ టెర్మినల్‌ను ప్లాన్ చేశారు. దీని కోసం దాదాపు 500 ఎకరాల భూమి అవసరం అని రైల్వే శాఖ గుర్తించింది.
అమరావతి… రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనూ.. రైల్వే కనెక్టివిటీని పెంచేలా ఎర్రుబాలెం-నంబూరు కొత్త లైన్‌ను అనుసంధానిస్తూ ఇక్కడ 300 ఎకరాల్లో టెర్మినల్ నిర్మించనున్నారు.
గన్నవరం.. విజయవాడ స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా గన్నవరం వద్ద 145 ఎకరాల్లో మరో కోచింగ్ టెర్మినల్ రాబోతోంది. దీనివల్ల విజయవాడ మీదుగా వెళ్లే రైళ్ల నిర్వహణ ఈజీ అవుతుంది.
తిరుపతి (రేణిగుంట ప్రాంతం)..ఆధ్యాత్మిక నగరం తిరుపతికి వచ్చే భక్తుల రద్దీ వల్ల..తిరుపతి-రేణిగుంట మధ్య ఈ మెగా టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తిరుపతి స్టేషన్లో ప్లాట్‌ఫారమ్ ఖాళీ లేక రైళ్లు బయట నిలిచిపోయే పరిస్థితి తప్పుతుంది.
ఈ మెగా ప్రాజెక్టుల కోసం రైల్వే శాఖ భూమిని సేకరించి ఇవ్వాలని కోరగా.. ఏపీలోని కూటమి ప్రభుత్వం భూమి సిద్ధమని ప్రకటించింది. దీంతో భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రైల్వే శాఖ పనులను ప్రారంభించబోతోంది. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే ఏపీ గుండా మరిన్ని కొత్త రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది, అలాగే రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గుతుంది.



