America – Iran : శాంతి ఒప్పందంపై సంతకాలు..ముగిసిన ఇరాన్ , అమెరికా యుద్ధం
America - Iran : ఈ ఒప్పందం 3 నెలల పాటు సాగిన యుద్ధానికి ముగింపు పలికింది.లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేసారు
America – Iran
దాదాపు మూడు నెలలకు పైగా భీకరంగా సాగిన అమెరికా , ఇరాన్(America – Iran) మధ్య యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై అమెరికా , ఇరాన్ అధ్యక్షులు సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఈ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు.
నిన్నటి నుంచే శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. జీ7 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లిన ట్రంప్ అక్కడే సంతకాల అంశాన్ని పూర్తి చేశారు.ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్ లోపల శాంతి ఒప్పందంపై సంతకం చేసినట్టు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. మరోవైపు ఇరాన్ కూడా అవగాహనా ఒప్పందం ఖరారైనట్లు ప్రకటించింది.
ఇరు పక్షాలు డిజిటల్ సంతకాల ప్రక్రియను పూర్తి చేయడంతో ఈ ఒప్పందం అధికారికంగా అమలులోకి వచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయి తెలిపారు. శాంతి ఒప్పందంపై డిజిటల్ పద్ధతిలో సంతకాలు చేయాలని ముందే నిర్ణయించామనీ,.ఇరు వైపులా ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు అధికారికంగా ఖరారైందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందం 3 నెలల పాటు సాగిన యుద్ధానికి ముగింపు పలికింది.లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేసారు. హార్ముజ్ జలసంధి అతి త్వరలో తెరచుకోనుంది. కాగా ఇది తాత్కాలిక ఒప్పందం మాత్రమే. తర్వాత చర్చలు జరిపి అవగాహన కుదిరితే 60 రోజుల్లో శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం ఉంటుంది.
కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా దాడులతో యుద్ధం మొదలయింది. మూడు నెలల పాటు భీకరంగా సాగిన యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా హతమార్చింది. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై విరుచుకుపడింది. రెండు దేశాలకు ఇరాన్ దీటుగానే బదులిచ్చింది.

ఇదిలా ఉంటే ఇరాన్ కు మద్దతిచ్చిన లెబనాన్ లోనూ బాంబుల మోత మోగింది. ఈ యుద్ధంలో దాదాపు లక్ష మంది చనిపోయినట్టు అంచనా వేసారు. ఇక ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూసివేయడంతో అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% దీని గుండానే రవాణా అవుతుంది. యుద్ధం కారణంగా ఈ జలసంధి దిగ్బంధనం కావడం వల్ల చమురు కొరత ఏర్పడి, ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ చమురు ధరలు సాధారణ స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.





