Vishaka Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి భద్రతా లోపాలే కారణమా?ఈ పదేళ్లలో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగాయి?
Vishaka Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, దశాబ్ద కాలంగా జరుగుతున్న వరుస ప్రమాదాలను గమనిస్తే ఇవి ఒక పునరావృత సమస్యగా మారాయని అర్ధమవుతోంది
Vishaka Steel Plant
తెలుగు ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్(Vishaka Steel Plant)లో నిన్న జరిగిన ప్రమాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోతోంది. ప్లాంట్‌లోని SMS-2 (స్టీల్ మెల్టింగ్ షాప్) విభాగంలో సోమవారం అంటే జూన్ 8న ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకరమైన ఘటనతో ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ లోపాలు ,పాతబడిన యంత్రాల నిర్వహణపై పరిశ్రమ వర్గాల్లో మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
అయితే ఈ ప్రమాదం జరిగిన తీరు ప్రత్యక్ష సాక్షులను ఆందోళనలకు గురిచేసింది. స్టీల్ మెల్టింగ్ షాప్-2 విభాగంలో హాట్ మెటల్ హ్యాండ్లింగ్ జరుగుతుండగా .. వేల డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కుతో నిండిన ఒక భారీ ల్యాడిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
దాంతో అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్న కార్మికులపై ఆ ద్రవం పడటంతో క్షణాల వ్యవధిలోనే అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిస్టమ్, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. ఈ ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్(Vishaka Steel Plant)లో ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, దశాబ్ద కాలంగా జరుగుతున్న వరుస ప్రమాదాలను గమనిస్తే ఇవి ఒక పునరావృత సమస్యగా మారాయని అర్ధమవుతోంది. ముఖ్యంగా 2012లో స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనలో.. ఏకంగా 19 మంది ఉద్యోగులు మృతి చెందడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఆ తర్వాత ఉన్నత స్థాయి విచారణలు జరిపినా శాశ్వత మార్పులు రాలేదనే విమర్శలు నేటికీ ఉన్నాయి. ఆ తర్వాత 2023లో జరిగిన ఒక ప్రమాదంలో 11 మంది తీవ్ర గాయాలు పాలవగా..2024, 2025 లలో వరుసగా అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఇప్పుడు జరిగిన ఈ తాజా ప్రమాదంతో.. భద్రతా వ్యవస్థలపై మరోసారి పెద్ద సందేహాన్ని రేకెత్తిస్తోంది.
ఇలాంటి ప్రమాదాల వెనుక ఎన్నో వ్యవస్థాగత లోపాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిగా, ప్లాంట్‌లో కాలంచెల్లిన, పాతబడిన యంత్రాలను ఇప్పటికీ వాడుతుండటం ఒక పెద్ద సమస్యగా మారింది.
రెండోది, క్రమం తప్పకుండా జరగాల్సిన సేఫ్టీ ఆడిట్స్, క్వాలిటీ చెక్స్ ,మెయింటెనెన్స్ పనులలో అలసత్వం వహించడం. మూడోది, సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండే మోల్టెన్ మెటల్ హ్యాండ్లింగ్ విషయంలో తీసుకోవాల్సిన అత్యున్నత స్థాయి సేఫ్టీ చర్యలు కరువవ్వడం.
వీటన్నింటికీ తోడు ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగకపోవడం, ఎగ్జిట్ ప్లాన్స్ సరిగ్గా లేకపోవడం వంటివి నష్టాన్ని పెంచుతున్నాయి. కేవలం రూల్స్ ఉండటమే కాదు వాటిని అమలు చేసే క్రమశిక్షణ, కార్మికులలో అవగాహన ఉండాలి.

ఒక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఇలాంటి ప్రమాదాలు ఇలా పదే పదే జరగడానికి కేవలం దురదృష్టమని సరిపెట్టుకోలేము. బడ్జెట్ కొరత వల్ల భద్రతా పరమైన ఆధునీకరణ పనులను వాయిదా వేయడం, ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలనే ఒత్తిడిలో బేసిక్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రతిసారీ విచారణ కమిటీలు వేయడం, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది తప్ప, సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం విచారణ నివేదికలతో సరిపెట్టకుండా, ప్లాంట్‌లో పనిచేసే వేలాది మంది కార్మికుల ప్రాణాలకు పూర్తి భరోసా దక్కేలా చూడాలి. కఠినమైన భద్రతా నిబంధనలను నిత్యం అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Peddi : ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో పెద్ది..చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్





