HealthLatest News

Chia Seeds : చియా గింజల ఆరోగ్య రహస్యాలు..తెలిస్తే అస్సలు వదలరు..

Chia Seeds : చిన్నగా ఉన్నా సరే, చియా సీడ్స్ పోషకాల గని అని చెప్పొచ్చు. వీటిలో శరీరానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, మినరల్స్ దాగి ఉన్నాయి

Chia Seeds

ఈ రోజుల్లో హెల్త్, ఫిట్‌నెస్ గురించి మాట్లాడే చాలామంది నోటినుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు చియా సీడ్స్(Chia Seeds). చిన్నగా సబ్జా గింజల్లా కనిపించే ఈ సూపర్‌ఫుడ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కేవలం బరువు తగ్గడానికే కాదు..బాడీకి కావలసిన ఎన్నో పోషకాలను అందించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

చూడటానికి చాలా చిన్నగా ఉన్నా సరే, చియా సీడ్స్(Chia Seeds) పోషకాల గని అని చెప్పొచ్చు. వీటిలో శరీరానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, మినరల్స్ దాగి ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా బాడీకి కావలసిన రోజువారీ ఫైబర్ దీనిలో బాగా దొరుకుతాయి.

ఇంకా చెప్పాలంటే శాఖాహారులకు ఇదొక అద్భుతమైన ప్రోటీన్ మూలం. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఎముకల బలానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా వీటిలో మెండుగా ఉంటాయి.

ఈ చియా సీడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలుంటాయి. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకుని జెల్ లాగా మారడంతో.. వీటిని తిన్నప్పుడు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. దీంతో ఎక్కువ సమయం ఆకలి వేయకపోవడం వల్ల బరువు తగ్గుతారు. దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవడంతో పాటు జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది.

అలాగే ఇవి రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులను రాకుండా కూడా కాపాడతాయి. ఇవి తిన్న తర్వాత బాడీలో రక్తం గ్లూకోజ్‌ను మెల్లగా గ్రహిస్తుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. పాలు తాగని వాళ్లకు లేదా కాల్షియం లోపం ఉన్నవాళ్లకు ఎముకలు, పళ్లు బలంగా మారడానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి.

అయితే చియా సీడ్స్‌ను ఎప్పుడూ కూడా డైరెక్టుగా తినకూడదు. ఇవి ద్రవ పదార్థాలను పీల్చుకుని ఉబ్బుతాయి కాబట్టి గొంతులోపల అడ్డుపడే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎప్పుడూ నానబెట్టుకునే వాడాలి.

ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా చియా సీడ్స్ వేసి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. ఈ గింజలు ఉబ్బి జెల్ లాగా మారిన తర్వాత ఆ నీటిని తాగేయొచ్చు. టేస్ట్ కోసం దీనిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు.

Chia Seeds
Chia Seeds

లేదా ఫ్రూట్ జ్యూస్‌లలో, మిల్క్ షేక్స్‌లో ఈ నానబెట్టిన గింజలను కలుపుకొని తాగొచ్చు. అలాగే ఫ్రూట్ సలాడ్స్ పైన లేదా కప్పు పెరుగులో వీటిని చల్లుకుని కూడా తినొచ్చు. రాత్రి పూట బాదం పాలలో కానీ మామూలు పాలలో కానీ చియా సీడ్స్, కొద్దిగా తేనె కలిపి ఫ్రిజ్‌లో పెడితే.. ఉదయానికి అది గట్టిగా పుడ్డింగ్ లాగా మారుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇదొక హెల్తీ ఆప్షన్ అంటారు ఫిట్‌నెస్ నిపుణులు.

ఈ చియా సీడ్స్‌ను(Chia Seeds) రోజులో ఏ సమయాల్లో అయినా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఉదయం పూట ఖాళీ కడుపుతో చియా వాటర్ తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు అతిగా తినకుండా ఉంటారు. చివరగా చెప్పాలంటే, చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివే అయినా కూడా రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది. అయితే మొదటిసారి వాడేవాళ్లు తక్కువ పరిమాణంతో మొదలుపెట్టాలి.

Rohini Karthe:రోహిణి కార్తె ఎంటర్ అయిపోతుంది.. ఈసారి ముందే ఎండల తీవ్రత ఎందుకు ఎక్కువయింది?

Related Articles

Back to top button