Cancer :క్యాన్సర్ వంశపారంపర్యమా? తల్లిదండ్రులకు క్యాన్సర్ సోకితే పిల్లలకు వస్తుందా?
Cancer : 90% పైగా క్యాన్సర్లు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం , వయసు పెరగడం వల్ల కణాలలో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తాయి.
Cancer
క్యాన్సర్ పేరు చెప్పగానే చాలామందిలో ఇది వారి పిల్లలకు కూడా వస్తుందా? అనే ఆందోళనలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఒక కుటుంబంలో తల్లికో, తండ్రికో క్యాన్సర్ సోకినప్పుడు, వారి కుటుంబంలో అంతకుముందు ఎవరికీ ఆ చరిత్ర లేకపోయినా, పిల్లల భవిష్యత్తు గురించి భయం వేయడం కామన్‌గా జరుగుతుంది.
అయితే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే..అన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. వైద్య శాస్త్రంలో చెబుతున్నదాని ప్రకారం కేవలం 5% నుంచి 10% క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన (Hereditary) కారణాల వల్ల వారి పిల్లలకు వస్తాయి. మిగిలిన 90% పైగా క్యాన్సర్లు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం , వయసు పెరగడం వల్ల కణాలలో వచ్చే మార్పుల (Mutations) వల్ల సంభవిస్తాయి.
ఒకవేళ వారి కుటుంబంలోని పూర్వీకులలో ఎవరికీ క్యాన్సర్ లేకపోయినా కూడా.. తల్లికో ,తండ్రికో క్యాన్సర్ వచ్చిందంటే, దానికి వారి జీవితకాలంలో జరిగిన జన్యు మార్పులే కారణం అవుతాయి. దీనిని అక్వైర్డ్ మ్యుటేషన్( Acquired Mutation) అంటారు. ఇలాంటి సందర్భాల్లో వారి నుంచి క్యాన్సర్ పిల్లలకు వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే, తల్లిదండ్రులకు సోకిన క్యాన్సర్ ఏ రకమైనదనే దానిపైన కూడా రిస్క్ ఆధారపడి ఉంటుంది.
తక్కువ వయసులోనే అంటే 50 ఏళ్ల లోపు క్యాన్సర్ రావడం అలాగే రొమ్ము (Breast), అండాశయ (Ovarian), లేదా పెద్దపేగు (Colorectal) క్యాన్సర్లు రావడం, అలాగే ఒకే వ్యక్తికి రెండు రకాల క్యాన్సర్లు రావడం వంటి కేసులలో వారి పిల్లలకు వచ్చే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది. .
ఇక్కడ ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు క్యాన్సర్ వచ్చినంత మాత్రాన పిల్లలకు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కేవలం క్యాన్సర్ వచ్చే ప్రమాదం (Susceptibility) మాత్రమే కాస్త ఎక్కువగా ఉండొచ్చు.

దీనికోసం తల్లిదండ్రులకు వచ్చిన క్యాన్సర్ జన్యుపరమైనదా కాదా అని తెలుసుకోవడానికి ‘జెనెటిక్ టెస్టింగ్’ చేయించుకోవాలి. ఒకవేళ అది వంశపారంపర్యంగా వచ్చే జన్యువు (ఉదాహరణకు BRCA1, BRCA2) వల్ల అని తేలితే మాత్రం, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి.
కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు డాక్టర్ల సలహాతో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే చికిత్స చాలా ఈజీ అవుతుంది. క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించుకోవడానికి పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేస్తే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
మొత్తంగా చూస్తే..క్యాన్సర్ పట్ల భయం కంటే అవగాహన ముఖ్యమన్న విషయం తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు క్యాన్సర్ రావడం అనేది పిల్లలకు మరణశాసనం కానే కాదు. సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు ,ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
Salt:సాయంత్రం పూట ఉప్పు కొంటున్నారా? ఉప్పుతో వాస్తు చిట్కాలు





