Cucumber : కీరా దోసకాయతో సలాడ్ కాదు.. పచ్చడి ట్రై చేయండి
Cucumber : ఇప్పుడు అదే పాన్‌లో కీరా ముక్కలు, టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి, ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ముక్కల్లోని నీరంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
Cucumber
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో శరీరం హీటెక్కకుండా దోసకాయ, కీరా, పుచ్చకాయ వంటివి తింటూ బాడీలోని హీటును చల్లార్చుకుంటున్నారు.. దీనిలో ముఖ్యంగా కీరా (Cucumber) అయితే సలాడ్ల రూపంలో లేదా కీరా ముక్కలుగా తింటున్నారు.
ఈ సీజన్‌లో సాధారణంగా అందరూ పచ్చిగా తినే ఈ కీరా దోసకాయతో ఇప్పుడు ఒక ఇన్‌స్టంట్ పచ్చడిని ట్రై చేయొచ్చని చాలామందికి తెలియదు. దీని తయారీ విధానం చాలా తేలిక, పైగా రుచి అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
మీడియం సైజు కీరా దోసకాయలు – 4
టమాటాలు – 4
పల్లీలు – 2 స్పూన్లు,
మినప్పప్పు – 2 స్పూన్లు
పచ్చిమిర్చి – రుచికి తగినంత
చింతపండు – కొద్దిగా,
వెల్లుల్లి రెబ్బలు – 10
జీలకర్ర,
పసుపు,
ఉప్పు – తగినంత
ముందుగా కీరా(Cucumber )ను శుభ్రంగా కడిగి, మరీ చిన్నవి కాకుండా మీడియం ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. టమాటాలను కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేసి పల్లీలు, మినప్పప్పు వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో చీలిక చేసిన పచ్చిమిర్చి వేసి వేయించి, వాటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో కీరా ముక్కలు, టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి, ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ముక్కల్లోని నీరంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లోని పచ్చిమిర్చితో పాటు ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత చల్లారిన కీరా-టమాటా ముక్కలను కూడా వేసి, మరీ మెత్తగా కాకుండా రోటి పచ్చడిలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత వేరే చిన్న పాన్‌లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి, తయారు చేసుకున్న పచ్చడిలో ఈ పోపును కలిపేస్తే సరి!
అంతే.. నోరూరించే కీరా దోసకాయ పచ్చడి రెడీ అయినట్లే. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి టేస్ట్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది.





