H1B Visa : 60 రోజుల్లో కొత్త జాబ్ రావాల్సిందే..హెచ్1బీ వీసాదారుల కష్టాలు
H1B Visa : హెచ్1 బీ వీసాతో అమెరికాలో ఉంటున్న భారతీయులకు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు
H1B Visa
ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఎంట్రీతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. చాలా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా లే ఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ఈ లే ఆఫ్స్ పర్వం భారతీయ ఉద్యోగులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
ఎందుకంటే హెచ్1 బీ వీసాతో అక్కడ ఉంటున్న భారతీయులకు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతే కొత్త ఉద్యోగాన్ని 60 రోజుల్లో వెతుక్కుని జాయిన్ అవ్వాలి. అలా జరగకుంటే అమెరికాను వీడి స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగాన్ని రెండు నెలల్లోపే సాధించకుంటే బ్యాగులు సర్దుకుని భారత్ కు వచ్చేయాల్సిందే.
దీంతో దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులందరికీ కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత హెచ్1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఇప్పుడు వాటిని లే ఆఫ్స్ కు, కొత్త ఉద్యోగాలకు లింక్ చేయడంతో భారతీయ ఉద్యోగులందరిలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్కడ ఇల్లు కొని, పిల్లల చదువుల కోసం భారీగా వెచ్చించిన వారంతా హఠాత్తుగా స్వదేశానికి తిరిగి రావాలంటే వారు పడే వేదన అంతా ఇంతా కాదు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అమెజాన్, ఒరాకిల్, మెటా వంటి కంపెనీలు ఉద్యోగాలను భారీస్థాయిలో తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల స్థానాల్లో ఏఐ సేవలను వాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గత 10 నెలల కాలంలో పెద్ద కంపెనీలన్నీ వేలల్లో ఉద్యోగులను ఇంటికి పంపించేసాయి. ఉద్యోగం పోయినా కొత్తది వస్తుందన్న ధీమా అక్కడ ఉన్న భారతీయుల్లో బాగానే ఉంది.
కానీ దానికి హెచ్ 1బీ వీసా లింకు పెట్టడమే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఈ కారణంగానే విజిటింగ్ వీసాలు తీసుకునేందుకు కూడా ఉద్యోగులు ఎగబడుతున్నారు. ఈ వీసాతో ఆరు నెలల వరకూ అమెరికాలోనే ఉండొచ్చు. అయితే వలసదారుల కోసం ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న కఠిన విధానాలతో విజిటింగ్ వీసాలు సాధించడం కూడా కష్టతరంగా మారింది. దీంతో లే ఆఫ్స్ అందుకున్న భారతీయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నారు.
Marriage:పెళ్లి వద్దంటున్న నేటి తరం.. వీరి మైండ్ సెట్ ఎందుకిలా మారుతుంది?





