Oscar : ఆస్కార్ అకాడమీ నిబంధనల్లో చారిత్రాత్మక మార్పులు.. భారత్‌కు డబుల్ ధమాకా..
Oscar : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల నిబంధనలలో..తాజాగా వచ్చిన చారిత్రాత్మక మార్పులను ప్రకటించింది
Oscar
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ప్రతిష్టాత్మక ఆస్కార్(Oscar) అవార్డుల నిబంధనలలో..తాజాగా వచ్చిన చారిత్రాత్మక మార్పులను ప్రకటించింది. 2027 మార్చి 14న జరగబోయే 99వ ఆస్కార్ వేడుకల నుంచి ఈ కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇక్కడి ప్రతిభావంతులైన డైరెక్టర్లకు అంతర్జాతీయ వేదికపై సరికొత్త అవకాశాలను కల్పిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ మూవీ ఇండస్ట్రీ రంగంలో అత్యంత అలాగే అత్యున్నత గౌరవంగా భావించే ఆస్కార్(Oscar) అవార్డుల ప్రస్థానం.. 1929 వ సంవత్సరం మే 16న హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్‌లో ప్రారంభమయింది. డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్, విలియం డిమిల్లే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఫస్ట బెస్ట్ మూవీగా వింగ్స్ నిలిచింది. అయితే 1939లో ఆస్కార్(Oscar) అనే పేరు అఫీషియల్‌గా స్థిరపడగా, అంతకుముందు 1927-28 కాలానికి సంబంధించిన చిత్రాలకు మొదటిసారిగా ఈ పురస్కారాలను అందజేశారు.
భారతీయ సినిమా గతిని మార్చేలా 99వ ఆస్కార్ నుంచి మూడు ప్రధాన మార్పులు రాబోతున్నాయి. గతంలో ఒక దేశం నుంచి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఒక మూవీని మాత్రమే పంపే వీలుండేది. కానీ ఇకపై ఆ పరిమితి ఉండదు. ముఖ్యంగా కేన్స్, వెనిస్, బెర్లిన్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు గెలుచుకున్న చిత్రాలు నేరుగా ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లోకి ప్రవేశించొచ్చు. దీనివల్ల భారతదేశం నుంచి ఒకే ఏడాది రెండు , మూడు చిత్రాలు పోటీ పడే ఛాన్స్ కలుగుతుంది.
ఇప్పటివరకు ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును ఏ సినిమాకు వచ్చిందో ..దానిని ఆ దేశానికి చెందినదిగా మాత్రమే పరిగణించేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం, ఈ ట్రోఫీని డైరెక్ట్‌గా దర్శకుడికే అందజేస్తారు, అంతేకాకుండా ఆ ట్రోఫీపై డైరెక్టర్ పేరును కూడా ముద్రిస్తారు. ఇది ఎస్.ఎస్. రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ వంటి టాప్ డైరెక్టర్స్‌కు అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచుతుంది.
యాక్షన్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రియేట్ చేసిన ప్రదర్శనలకు చోటు ఉండదు. కేవలం మనుషుల నటనకు మాత్రమే నామినేషన్లు దక్కుతాయి. అలాగే, ఒకే యాక్టర్ వేర్వేరు విభాగాలలో రెండు వేర్వేరు చిత్రాలకు నామినేషన్లు పొందే వీలును కూడా కల్పించారు.

కాగా భారతదేశం నుంచి ఇప్పటివరకు ఐదుగురు ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
భాను అథైయా (1983).. గాంధీ చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డు అందుకుని ఆస్కార్ గెలిచిన తొలి భారతీయురాలుగా నిలిచారు.
సత్యజిత్ రే (1992).. మూవీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను గౌరవ ఆస్కార్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్) అందుకున్నారు.
ఏఆర్ రెహమాన్ (2009).. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ మూవీకి ఉత్తమ ఒరిజినల్ స్కోర్ , ‘జయ్ హో’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెండు అవార్డులు సాధించి చరిత్రను సృష్టించారు.
రసూల్ పూకుట్టి (2009).. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో పురస్కారం పొందారు.
నాటు నాటు (2023) ..RRR సినిమాలోని ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది.దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీ సాంగ్‌గా నిలిచింది.
మొత్తంగా తాజా మార్పులతో ఇండియన్ డైరెక్టర్స్ , యాక్టర్లకు గ్లోబల్ స్థాయిలో మరిన్ని విజయాలు దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి.
Jamun Fruit: నేరేడుపండ్లు ఔషధ పండ్లే .. కానీ వారు అస్సలు తినకూడదట..





