Strait of Hormuz:మళ్లీ హర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయా?
Strait of Hormuz: ఇరాన్‌లోని ఎయిర్ పోర్టులను తిరిగి తెరుస్తున్నట్లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ సివిల్ ఏవియేషన్ అనౌన్స్ చేసింది.
Strait of Hormuz
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శాంతి చర్చలు ఫలించి అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి
ప్రపంచ చమురు వ్యాపారానికే గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మరోసారి మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అమెరికా అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగానే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశంతో పాటు, ఆర్థిక సంక్షేమం ముప్పు కూడా పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,ఇరాన్ ప్రభుత్వానికి మధ్య రీసెంట్‌గా కుదిరిన ఒప్పందాలు నీటి మూటలయ్యాయి. ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించడంతోనే ఈ తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా మారాయి.
తమ దేశంపై అమెరికా ఇంకా కూడా దౌర్జన్యాలకు పాల్పడుతుందని,కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘించిందని ఇరాన్ తీవ్రంగా మండిపడుతోంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తేసే వరకు, తాము హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. మరోవైపు తమ షరతులకు ఇరాన్ లొంగి వచ్చే వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ సర్కార్ మొండిగా ముందుకు వెళ్తోంది.
కాగా హర్ముజ్ జలసంధి(Strait of Hormuz) మూసివేతతో, ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ మరోసారి ఆ ప్రాంతాన్ని తన పూర్తి ఆధీనంలోకి తీసుకుంది. సముద్ర జలాలపై గట్టి నిఘా ఉంచడంతో పాటు , నౌకల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేయడంతో సముద్ర మార్గంలో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.
అయితే, ఇదే సమయంలో ఇరాన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని ఎయిర్ పోర్టులను తిరిగి తెరుస్తున్నట్లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ సివిల్ ఏవియేషన్ అనౌన్స్ చేసింది. సముద్ర మార్గాన్ని మూసివేసి, ఆకాశమార్గాన్ని తెరవడం ద్వారా ఇరాన్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

హర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచానికి అవసరమైన చమురులో సుమారు మూడో వంతు సరఫరా అవుతుంది. ఈ
సముద్ర మార్గం మూసుకుపోవడమంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు బ్రేకులు పడటమే అవుతుంది. ఇలా చమురు సరఫరా ఆగిపోతే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయి.
దీని వల్ల కేవలం రవాణా రంగం ఒక్కటే కాదు.. నిత్యావసర వస్తువుల ధరలపైనా కూడా ప్రభావితం చూపిస్తుంది. ఇప్పటికే అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు ఈ చమురు మంట పెద్ద భారంగా మారే అవకాశం ఉంది.
Varanasi: సృష్టికి ముందే పుట్టిన వారణాసి.. కాశీ గురించి మీకు తెలియని అద్భుత రహస్యాలు





