Wetlands : పవన్ చొరవతో ఏపీలో 16 ముఖ్యమైన చిత్తడి నేలలు గుర్తింపు..కల్లేరు మోడల్లో ఏపీ వేట్ల్యాండ్స్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్
Wetlands:ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర వేట్ల్యాండ్ అథారిటీ సమావేశంలో ఒకేసారి 16 ముఖ్యమైన చిత్తడి నేలలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

Wetlands
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తడి నేలల (Wetlands) గుర్తింపు, పరిరక్షణ , పర్యాటక అభివృద్ధి కోసం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర వేట్ల్యాండ్ అథారిటీ సమావేశంలో ఒకేసారి 16 ముఖ్యమైన చిత్తడి నేలలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. దక్షిణ భారతదేశంలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో చిత్తడి నేలలను గుర్తించడం ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుంది .
రాష్ట్రంలో మొత్తం 23,450కి పైగా చిత్తడి నేలలు(Wetlands) ఉన్నా కూడా.. మొదటి విడతలో 16 ప్రధాన వేట్ల్యాండ్లను గుర్తించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 99.3% చిత్తడి నేలలకు సంబంధించిన డిజిటల్ మ్యాపింగ్ పూర్తయింది. అక్టోబర్ 28 లోపు అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల కలయికతో ఫిజికల్ బౌండరీ మార్కింగ్ కూడా పూర్తి కానుంది. ప్రముఖంగా గుర్తించిన చిత్తడి నేలల్లో సోంపేట (శ్రీకాకుళం), పెదబీలా, చినబీలా, తుంపా, కల్లేరు సరస్సు (ఇది ఇప్పటికే రాంసర్ గుర్తింపు పొందింది), అనంతపురం వీరాపురం, రాజమండ్రి దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుపై పరిరక్షణ , పర్యాటక అభివృద్ధి అనే రెండు అంశాలపై దృష్టి సారించారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన ప్రకృతి , భూమిని అందించాలనే లక్ష్యంతో సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

జాతీయ , అంతర్జాతీయ వేట్ల్యాండ్ ప్రమాణాలకు అనుగుణంగా సంరక్షణ చేపట్టడంతో పాటు, స్థానిక ఉపాధిని పెంచడానికి పర్యాటక కారిడార్‌తో పాటు ఎకో టూరిజం అభివృద్ధిని చేపట్టనున్నారు. ముఖ్యంగా, 2018లో ప్రజా సంకల్పయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ సోంపేట చిత్తడి నేలలను స్వయంగా పరిశీలించి, అక్కడి అక్రమ ఆక్రమణలు, స్థానిక జీవవైవిధ్యాన్ని రక్షించేందుకు ప్రమాణం చేశారు.
రాష్ట్రానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు.. చిత్తడి నేలల భద్రత వల్ల వరదలు నియంత్రించబడతాయి. అలాగే, భూగర్భ జలాల నిల్వ , సహజ ఫిల్టరేషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది.
జీవవైవిధ్యం, రైతులకు లబ్ధి చేకూరుతుంది. సాగు భూములు వరద నష్టం నుంచి నివారించబడతాయి. దీంతోపాటు మత్స్య సంపద, పక్షి సంపదల పెంపకానికి అవకాశం లభిస్తుంది.
సోంపేట,పెదబీలా, తుంపా వంటి వేల ఎకరాల్లో విస్తరించిన చిత్తడి నేలల చుట్టూ ఎకోటూరిజం కారిడార్ అభివృద్ధి చేయడం ద్వారా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి , రాష్ట్ర పర్యాటక ఆదాయం పెరుగుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు: ఇప్పటికే రాంసర్ సైట్‌గా ఉన్న కల్లేరును ఒక మోడల్‌గా తీసుకుని, మిగతా చిత్తడి నేలలకు కూడా గ్లోబల్ వారసత్వ హోదా (Global Heritage Status) కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఈ ప్రణాళికలో భాగంగా, వేట్ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబడుతుంది. వార్షికంగా గ్రీన్ జాబ్స్, విద్యార్థులకు నేచర్ స్టడీస్, స్థానిక కమ్యూనిటీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ముఖ్యంగా, అక్రమ ఆక్రమణల నివారణకు కఠిన నిబంధనలు ,రెగ్యులర్ మానిటరింగ్ చేపట్టబడుతుంది. వీరాపురం, రాజమండ్రి పుణ్యక్షేత్రం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక బర్డ్ కన్జర్వేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు, మత్స్యకారులకు ఆదాయం; స్థానికులకు పర్యాటక ఉపాధి కలుగుతుంది. ప్రకృతికి జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ సమతుల్యత లభిస్తాయి. ఏపీలో ఈ 16 చిత్తడి నేలల(Wetlands) గుర్తింపుతో పాటు, పవన్ కళ్యాణ్ యొక్క దూరదృష్టితో కూడిన ఈ ప్రణాళిక భూగర్భజల భద్రత, పర్యాటక ఆదాయం , ఎకో పథకాలలో దేశానికే ఆదర్శంగా నిలబడేలా చేయనుంది.
One Comment