KGH : గుండెకు గుదిబండగా .. విశాఖ కేజీహెచ్
KGH :ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యానికి చిరునామాగా నిలిచిన విశాఖపట్నం కింగ్‌జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) ప్రస్తుతం మృత్యువుకు నిలయంగా మారింది.

KGH : ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యానికి చిరునామాగా నిలిచిన విశాఖపట్నం కింగ్‌జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) ప్రస్తుతం మృత్యువుకు నిలయంగా మారింది. ఆరు నెలలుగా అంటే దాదాపు 2025 జనవరి నుంచి, ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో ఒక్క ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరగడం లేదంటే ఇదేమంత చిన్న విషయం కాదు. సాధారణంగా నెలకు 30 నుంచి 50 గుండె ఆపరేషన్లు జరిగే చోట, ఇప్పుడు నిశ్శబ్దం తాండివిస్తోంది. ఆపరేషన్ కోసం ఎదురుచూసే రోగుల ఆర్తనాదాలు మాత్రమే వినిపిస్తున్నాయి.ఉత్తరాంధ్రకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ఆస్పత్రిలో ఇప్పుడు నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.
Visakhapatnam KGH
ఈ విషాదానికి కారణం ఏదో పెద్ద ఆర్థిక సంక్షోభం కాదు, నిధుల కొరత అంతకంటే కాదు. కేవలం మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తే తిరిగి ప్రాణం పోసుకునే హార్ట్ లంగ్ మెషిన్ , టెంపరేచర్ మానిటరింగ్ మెషిన్ పనిచేయకపోవడమే. మానవ శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని ఆపరేషన్ సమయంలో ఈ యంత్రాలే చూసుకుంటాయి. ఇవి పనిచేయకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ అసాధ్యం. ఈ అత్యంత కీలకమైన పరికరాల మరమ్మత్తు లేదా కొనుగోలు కోసం అధికారులు చూపిన నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నాయి.
ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం వాడే హార్ట్ లంగ్ మెషిన్ (HLM).. దీనిని కార్డియోపల్మోనరీ బైపాస్ (CPB) మెషిన్ అని కూడా పిలుస్తారు. ఓపెన్ హార్ట్ సర్జరీల సమయంలో అత్యంత కీలకమైన పరికరం. గుండె లేదా ఊపిరితిత్తులపై శస్త్రచికిత్స చేసేటప్పుడు, సర్జన్లు ఈ అవయవాలపై నేరుగా పనిచేయడానికి వీలుగా వాటిని తాత్కాలికంగా ఆపాలి. ఈ సమయంలో రోగి శరీరానికి రక్తం సరఫరా ఆగిపోకుండా, ఆక్సిజన్ అందేలా చూసే బాధ్యతను HLM తీసుకుంటుంది.
అలాగే టెంపరేచర్ మానిటరింగ్ మెషిన్ (TMM) అనేది రోగి శరీర ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షించే పరికరం. గుండె శస్త్రచికిత్సలలో, శరీర ఉష్ణోగ్రత చాలా కీలకం. HLM శరీర ఉష్ణోగ్రతను మార్చడానికి సహాయపడినప్పటికీ, TMM ఆ ఉష్ణోగ్రతను నిరంతరం కొలిచి, డాక్టర్లకు, HLMను ఆపరేట్ చేసే నిపుణులకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించుకోలేని లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలకు కేజీహెచ్ ఒక్కటే ఆశాకిరణం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు కేజీహెచ్‌ను ఆశ్రయిస్తారు. ఆరునెలల నుంచి ఈ రెండు మిషన్లు పాడవడంతో కొంతమంది ప్రాణం మీది ఆశ వదులుకుని నిస్సహాయంగా ఇంటిదారి పడుతుంటే, మరికొందరు అప్పులపాలై ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కుతున్నారు. అంతేకాదు ఈ ఆరు నెలల కాలంలో, సమయానికి చికిత్స అందక కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు కూడా తెలుస్తోంది.
హార్ట్ లంగ్ మెషిన్ , టెంపరేచర్ మానిటరింగ్ మెషిన్ ధర మూడు కోట్ల వరకూ ఉంటుంది. నిజానికి వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వానికి..ఇదేమీ పెద్ద ఖర్చు కాదు. అందుకే ప్రజారోగ్యానికి, ప్రజల కోసం ఆలోచించి వెంటనే దీనిపై స్పందించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. ఇదివరకిటిలా కేజీహెచ్‌లోనే ఈ సదుపాయాన్ని అందించాలని విజ‌్ఞప్తి చేస్తున్నారు.