Quick Commerce: రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే డెలివరీ..క్విక్ కామర్స్ లాంచ్ చేసిన ప్రభుత్వం
Quick Commerce: ప్రైవేట్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు పోటీగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులను ప్రజల ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేసే సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
Quick Commerce
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. ప్రముఖ ప్రైవేట్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్(Quick Commerce)కు (BlinKit, Zepto, Swiggy Instamart) పోటీగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులను ప్రజల ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేసే సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ డిజిటల్ చొరవ ద్వారా రైతులకు ఎక్కువ అమ్మకాలు జరిగేలా చేయడంతో పాటు, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘డిజి రైతు బజార్’ పేరుతో అనే క్విక్ కామర్స్(Quick Commerce) వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమకు కావలసిన కూరగాయలు, పండ్లు మరియు నిత్యావసర సరుకులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పించారు.
రైతు బజార్లతో అనుసంధానం.. ప్రైవేట్ యాప్స్‌కు భిన్నంగా, ప్రభుత్వ ఈ-కామర్స్ వ్యవస్థ రాష్ట్రంలోని రైతు బజార్లను ప్రధాన కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది. వినియోగదారులు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే, వారికి దగ్గరలో ఉన్న రైతు బజార్లు డిస్‌ప్లే అవుతాయి. ఆయా రైతు బజార్లలోని కూరగాయలు, పండ్లు, ఇతర సరుకుల ధరల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన తర్వాత, వినియోగదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ (క్యాష్ ఆన్ డెలివరీ) పద్ధతిలో పేమెంట్ చేయవచ్చు. ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే, సరుకులను నేరుగా ఇంటికి డెలివరీ చేస్తారు. ప్రస్తుతం ఈ సేవలను రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు డెలివరీ చేసేందుకు వీలు కల్పించారు.
ఈ డిజిటల్ రైతు బజార్ విధానం ద్వారా రెండు ముఖ్యమైన వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది.రైతులు తమ ఉత్పత్తులను నేరుగా రైతు బజార్ల ద్వారా విక్రయిస్తారు. ప్రభుత్వమే డెలివరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అమ్మకాలు పెరుగుతాయి, దీనివల్ల వారికి ఆర్థికంగా అధిక ప్రయోజనం దక్కుతుంది.
ఇటు ప్రైవేట్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ తమ లాభం కోసం అధిక ధరలకు సరుకులను విక్రయించడంతో పాటు, అదనపు డెలివరీ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తుంటాయి. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వెబ్‌సైట్‌లో రైతు బజార్లలో ఉన్న ధరలకే సరుకులు లభిస్తాయి. అంతేకాకుండా, అదనపు ఛార్జీలు ఏమీ ఉండకపోవడంతో, సామాన్యులకు డబ్బు కూడా ఆదా అవుతుంది.

ప్రభుత్వం ప్రస్తుతం ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలోని ఎంపీపీ కాలనీ రైతు బజార్‌లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ (Quick Commerce)విజయవంతం అయిన తర్వాత, విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని రైతు బజార్లకు ఈ డోర్ డెలివరీ సేవలను విస్తరించనున్నారు. అంతేకాకుండా, ప్రజలు మరింత సులువుగా ఈ సేవలను పొందేందుకు భవిష్యత్తులో ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌ను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని అడ్డుకునేందుకు, రైతులకు, వినియోగదారులకు మధ్య మధ్యవర్తులను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ క్విక్ కామర్స్ నిర్ణయం ఒక విప్లవాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు.



