Basavatarakam:ఏపీలోనూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్..సేవలు ఎప్పటి నుంచి అంటే..
Basavatarakam: అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను రూ. 750 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు.

Basavatarakam
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కి వెళ్లాల్సిన కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. రాజధాని అమరావతిలో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టును కేవలం ఒక ఆసుపత్రిగా కాకుండా, క్యాన్సర్ చికిత్స, పరిశోధన, సంరక్షణలకు ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్యాంపస్ నిర్మాణం కోసం భూమిపూజ కార్యక్రమం జరుగగా, సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఏపీలో అగనంపూడిలో ఉన్న హోమీబాబా ఆసుపత్రి లాంటి కొన్ని కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మెరుగైన, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స కావాలంటే చాలామంది హైదరాబాద్‌లోని బసవతారకం(Basavatarakam) క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇది రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో శారీరక, ఆర్థిక భారంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు అమరావతిలో నిర్మించబోయే ఈ కొత్త క్యాంపస్‌తో ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి.
రాజధాని అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను రూ. 750 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో ఆంకాలజీ సేవలు, ఎక్స్‌లెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. 2028 నాటికి శస్త్ర చికిత్సలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండో దశలో పడకల సంఖ్యను 1000కి పెంచుతారు. దీనితో ఈ క్యాంపస్ క్లిష్టమైన, అరుదైన క్యాన్సర్ కేసులకు ఒక ముఖ్యమైన రిఫరల్ కేంద్రంగా మారనుంది.
ఈ కొత్త క్యాంపస్ స్థాపనకు ప్రేరణ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. 2000వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ లాభాపేక్ష రహిత సంస్థ, ఎన్.టి. రామారావు భార్య బసవతారక రామారావు జ్ఞాపకార్థం నిర్మించబడింది. హైదరాబాద్‌లో 500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స, పరిశోధన, ఆయుర్వేద, నాట్యుప్యాథీ వంటి సేవలను అందిస్తోంది.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న కొత్త క్యాంపస్, హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రి సేవలను మరింత విస్తృతంగా, సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు ఒక ఇంటిగ్రేటెడ్, అధునాతన చికిత్సా కేంద్రంగా సేవలందించనుంది. ఇది ప్రజారోగ్య రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది.