Amaravati: అమరావతిలో భారత్‌లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్.. ఏపీకి కొత్త గ్లోబల్ ఐడెంటిటీ ..ప్రత్యేకతలేంటి?
Amaravati: దేశంలోనే అతిపెద్దదైన రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని పునరుద్ధరణ ప్రణాళికలో ఇది ఒక భాగం.

Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో దేశంలోనే అతిపెద్దదైన రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని పునరుద్ధరణ ప్రణాళికలో ఇది ఒక భాగం. రూ.2,245 కోట్ల భారీ పెట్టుబడితో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్ మోడల్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నారు.
- ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది.
- ప్రాజెక్ట్ పేరు.. నూతన అమరావతి రైల్వే స్టేషన్
- మొత్తం పెట్టుబడి.. రూ.2,245 కోట్లు
- నిర్మాణ విస్తీర్ణం.. 1,500 ఎకరాలు (మొదటి దశలో 3 ఎకరాలపై నిర్మాణం)
- ప్లాట్‌ఫారమ్‌లు.. 24 (ఒకేసారి 40 ట్రైన్‌లు నిలిపే సామర్థ్యం)
- 4 టెర్మినల్స్ లో 3 లక్షల మంది దినసరి ప్రయాణ సామర్థ్యం
ఈ స్టేషన్ కేవలం ప్రయాణికుల రవాణా కేంద్రంగా కాకుండా, అత్యాధునిక మౌలిక సదుపాయాల కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇది భారతదేశంలోనే మొదటి ఎయిర్‌పోర్ట్ మోడల్ రైల్వే జంక్షన్ కావడం విశేషం.

దీనికి స్మార్ట్ టికెటింగ్ వ్యవస్థ, ఆటో గేట్లు , డిజిటల్ కాన్స్‌యిర్జ్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. భారీ వైటింగ్ లాంజ్‌లు, ఎయిర్‌కండీషన్డ్ ప్లాట్‌ఫారమ్‌లు , పటిష్టమైన లగేజ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయబడతాయి. ప్యాసింజర్ ట్రాఫిక్‌తో పాటు, వాణిజ్య అవసరాల కోసం ఫ్రైట్ హ్యాండ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా కలిగి ఉంటుంది. దీన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. సౌరశక్తి ద్వారా విద్యుత్ అవసరాలను తీర్చుకునే విధంగా రూపకల్పన చేశారు.
ఈ ప్రాజెక్ట్ అమరావతి(Amaravati)ని దేశంలోని ముఖ్య నగరాలతో నేరుగా అనుసంధానించనుంది. 57 కిలోమీటర్ల కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ అమరావతిని ఎర్రుపాలెం–నంబూరు ట్రాక్‌తో కలుపుతుంది. ఇందులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన మల్టిస్పాన్ ఐరన్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది.ఈ కనెక్టివిటీ ద్వారా అమరావతికి నేరుగా హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా , బెంగళూరు వంటి మెట్రో నగరాలతో అనుసంధానం ఏర్పడుతుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ఇప్పటికే టెండర్లు సిద్ధం చేసింది.విద్యుత్ రైలు లైన్ తో పాటు కృష్ణా నదిపై వంతెన నిర్మాణ పనులు మొదట ప్రారంభమవుతాయి.
స్టేషన్ ప్రధాన నిర్మాణం 2025 చివరిలో ప్రారంభమై, 2027–2028 మధ్య పూర్తి అవుతుందని అంచనా. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) కేటాయించిన 1,500 ఎకరాలలో భవిష్యత్తులో విద్యుత్ లోకో షెడ్లతో కూడిన రైల్వే టౌన్‌షిప్ ఏర్పాటు చేయబడుతుంది.
ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ విలువ అమరావతి రాజధాని పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఉన్న రూ. 58,000 కోట్ల అభివృద్ధి ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇది ఉద్యోగాలు, పెట్టుబడులు , పర్యాటక వృద్ధిని తెస్తుంది. వాణిజ్య మార్గాల విస్తరణతో విశాఖ–విజయవాడ–అమరావతి ఆర్థిక కారిడార్ మరింత బలోపేతం అవుతుంది. మెరుగైన కనెక్టివిటీ వల్ల అమరావతి త్వరలో గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, అమరావతి(Amaravati) రైల్వే స్టేషన్ భారతదేశంలో అత్యంత పెద్దదిగా, ఆసియా స్థాయిలో టాప్ 5 స్టేషన్లలో ఒకటిగా నమోదవుతుందని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించనున్నారు.