Vangapandu : ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు గొంతు మూగబోయి నేటికి నాలుగేళ్లు
Vangapandu :జననాట్యమండలి అధ్యక్షులు, విప్లవ గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం ..నేటి తరానికి తీరని లోటు

Vangapandu
ఏం పిల్లడో ఎల్దామొస్తవా… శ్రీకాకుళంలో సీమకొండకి…ఈ గీతం వినగానే ఉత్తరాంధ్ర జనపదం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ గొంతు మూగబోయి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఉత్తరాంధ్రకు సూర్యుడు అస్తమించిన రోజు అది. విప్లవ సూరీడు ఇక నిద్ర లేవనేలేదు. విప్లవ గీతాలతో జన చైతన్యాన్ని రగిలించిన ప్రముఖ కవి, వాగ్గేయకారుడు (Vangapandu) వంగపండు ప్రసాదరావు మరణం, కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక తీరని లోటు. ఆయన పాట, మాట, చిందు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయనది అనితర సాధ్యమైన మార్గం.
ఏం పిల్లడో ఎల్దామొస్తవా” అనే పాటలో శ్రీకాకుళం నుంచి తెలంగాణలోని కొమరయ్య కొండ, రాయలసీమ రాలుకొండల వరకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, ప్రాంతాల మధ్య ఉన్న విభజన రేఖలను చెరిపేశారు. అవసరాన్ని బట్టి విప్లవ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది ఉత్తరాంధ్ర, తెలంగాణ, లేక ఇంకో ప్రాంతమా అని చూడకుండా, సమాజాన్ని చైతన్యపరిచారు. చివరి శ్వాస వరకు విప్లవమే ఊపిరిగా బతికిన ఆయన పాటను తన బతుకు బాటగా మలుచుకున్నారు.
ఆయన (Vangapandu) పాటల్లో ఉత్తరాంధ్ర నుడికారం, యాస, ఊపు మిళితమై ఉంటాయి. పాటను పాడటంలో, చిందేయడంలో, చేతుల మధ్య గజ్జల్ని మోగించడంలో ఆయన శైలి చాలా ప్రత్యేకమైనది. ఆయన పాటలు దేశవిదేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో కూడా ఈ పాటలను ఇంగ్లీషులోకి అనువదించుకొని పాడుకున్నారంటే ఆయన పాటల పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. “యంత్రమెట్టా నడుస్తు ఉందంటే” అనే ఆయన పాట కూడా ఆంగ్లంలోకి అనువదించి మరీ ఆయనను ఓన్ చేసుకున్నారు.

వంగపండు ప్రసాదరావుగారు 1943 జూన్‌లో పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో జన్మించారు. 1972లో గద్దర్‌తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. విశాఖపట్నం షిప్ యార్డులో పనిచేస్తున్న రోజుల్లోనే పాటలు రాస్తూ, పాడుతూ విప్లవోద్యమానికి మద్దతునిచ్చారు. తర్వాత కాలంలో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయి కళాకారుడిగా మారి, సుమారు 400 వరకు పాటలు రచించారు. కేవలం విప్లవ గీతాలే కాకుండా, “ఆవులు తోలుకొని” వంటి శృంగార జానపద పాటలు కూడా రాసి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
1974 అక్టోబర్‌లో విశాఖలో జరిగిన విరసం సాహిత్య పాఠశాల నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన పాటలు “ఏరువాక” అనే పుస్తకంగా వెలువడి, సాహిత్య లోకంలో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టాయి. “జజ్జనకరి జనారే,” “జీపీ వత్తంది రండిరా,” “సుత్తీకొడవలి గుర్తుగ ఉన్నా ఎర్రని జెండ ఎగురుతున్నదీ” వంటి పాటలు జనం నోళ్ళలో నాని, ఉద్యమాలకు ఊతమిచ్చాయి. ఆయన కమ్యూనిస్టు ఉద్యమాల్లో కుల స్పృహ లేని రోజుల్లోనే “ఉందర్రా మాల పేటా ఊరి చివరా” అంటూ దేశంలోని కుల వాస్తవికతను ప్రకటించిన అభ్యుదయవాది.
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్న వంగపండు, తన జానపద కళా ప్రస్థానంలో తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనను ప్రజల కోసం బతికిన కళాకారుడిగా నాజర్‌తో పోలుస్తారు. వంగపండు వంటి వాగ్గేయకారులు బహు అరుదుగా పుడతారని, ఆయన మళ్లీ మన కోసం పుడతారేమోనని జనం ఎదురుచూస్తున్నారు. వంగపండు ప్రసాదరావుగారికి లాల్ సలామ్!
Also Read: Kunki’s elephant: పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులు పని మొదలెట్టేశాయ్..