Gold: బంగారంపై జీఎస్టీ ఎంత ? సామాన్యుడిపై భారం పెరిగిందా..తగ్గిందా?
Gold: బంగారం కొనేటప్పుడు మనం కేవలం దాని ధర మాత్రమే కాదు, అదనంగా కొన్ని పన్నులు, ఛార్జీలు కూడా కట్టాల్సి ఉంటుంది.

Gold
పండుగైనా, శుభకార్యమైనా… మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారం. కానీ ఇప్పుడు బంగారం(Gold) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కొన్ని కీలక మార్పులు చేసినా.. బంగారంపై పన్ను విషయంలో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. ఈ నిర్ణయం సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న చర్చ సాగుతోంది.
బంగారం(Gold) కొనేటప్పుడు మనం కేవలం దాని ధర మాత్రమే కాదు, అదనంగా కొన్ని పన్నులు, ఛార్జీలు కూడా కట్టాల్సి ఉంటుంది. బంగారంపై జీఎస్టీని ఎలా లెక్కిస్తారంటే..ముందుగా బంగారం విలువపై జీఎస్టీ వేస్తారు. అంటే మీరు కొనే బంగారం కడ్డీలు, నాణేలు లేదా ఆభరణాల విలువపై 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అంటే రూ.1 లక్ష విలువైన బంగారం కొంటే, దానిపై రూ.3,000 జీఎస్టీ చెల్లించాలి.
తయారీ ఖర్చులపై జీఎస్టీ.. ఆభరణాల తయారీ ఖర్చుపై 5 శాతం జీఎస్టీ పడుతుంది. ఉదాహరణకు, రూ.1 లక్ష విలువైన ఆభరణాలు కొంటే, దాని తయారీ ఖర్చు రూ.10,000 అయితే, దానిపై రూ.500 జీఎస్టీ అదనంగా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి, రూ.1 లక్ష విలువైన నగలు కొంటే, మీరు మొత్తం రూ.3,500 జీఎస్టీగా కట్టాలి. ఇది కొనుగోలుదారుడిపై ఒక అదనపు ఆర్థిక భారం.

కేంద్రం తాజాగా కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించినా.. బంగారం, వెండిపై పన్ను రేట్లను మాత్రం స్థిరంగా ఉంచింది. సాధారణంగా పండుగ సీజన్లలో బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయి. ఈ సమయంలో జీఎస్టీ రేటు తగ్గించి ఉంటే, అది సామాన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చేది. కానీ పన్నులు అలాగే ఉంచడం వల్ల, సామాన్యులకు భారం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. అయితే, వ్యాపారులకు పన్ను రేటు స్థిరంగా ఉండటం వల్ల వ్యాపారం చేయడానికి సౌలభ్యం ఏర్పడింది.
బంగారం(Gold) విలువ, తయారీ ఖర్చులు, వేస్టేజీ ఛార్జీలు అన్నింటిపై కలిపి జీఎస్టీ వర్తిస్తుంది. ఇది ఆభరణాల ధరను మరింత పెంచుతుంది. ఈ లెక్కలు సామాన్యులకు అర్థం కావడం కష్టమే. అయితే, ధరలు ఎంత పెరిగినా, బంగారంపై ఉన్న మక్కువ వల్ల కొనుగోలుదారులు వెనకడుగు వేయడం లేదు. ఈ పరిస్థితుల్లో, సామాన్య ప్రజల పండుగ కలలను నెరవేర్చుకోవాలంటే, జీఎస్టీలో కొంతైనా రాయితీ లభించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.