Swiggy: యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన స్విగ్గీ..దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
Swiggy: ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధారపడే వినియోగదారులకు, ఈ యాప్‌ల ద్వారా వ్యాపారం చేసే చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లకు భారం పెరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి

Swiggy
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో అతిపెద్దదిగా ఉన్న స్విగ్గీ, మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచి కస్టమర్లను ఆందోళనకు గురిచేసింది. ఇప్పుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే, వినియోగదారులు ప్రతి ఆర్డర్‌కు అదనంగా రూ. 14 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు రూ.12 గా ఉండేది. ఈ కొత్త పెంపుతో, ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేయడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
స్విగ్గీ (Swiggy)తన ఆదాయాన్ని పెంచుకోవడానికి, కంపెనీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ ఫీజుల పెంపును ఒక మార్గంగా ఎంచుకుంది. 2023లో మొదట రూ. 2తో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు, కేవలం రెండేళ్లలోనే 600 శాతం పెరిగి రూ. 14కి చేరుకుంది.
ఏప్రిల్ 2023: రూ.2, జూలై 2024: రూ.6 మళ్లీ అదే ఏడాది అక్టోబర్ 2024: రూ.10, ప్రస్తుతం: రూ.14గా ఫీజులు పెంచుతూ వెళుతుంది. రెండేళ్లలో 600 శాతంగా ఈ పెరుగుదల ఉంది
రోజుకు 2 మిలియన్ల (20 లక్షలు) కంటే ఎక్కువ ఆర్డర్‌లను డెలివరీ చేసే స్విగ్గీ, ఈ పెంపుతో భారీగా ఆదాయం ఆర్జించనుంది. ప్రతి ఆర్డర్‌పై రూ. 14 ఫీజుతో, కంపెనీకి రోజుకు రూ.2.8 కోట్ల అదనపు ఆదాయం, మరియు ఏడాదికి రూ.33.6 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది.
స్విగ్గీ(Swiggy), జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి 35% వరకు కమిషన్ రేట్లను వసూలు చేస్తున్నాయి. దీనివల్ల రెస్టారెంట్ యజమానులు తమ మెనూ ధరలను పెంచక తప్పడం లేదు.

ఫలితంగా, నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినడం కంటే ఆన్‌లైన్ ఆర్డర్లు 50 శాతం వరకు ఎక్కువ ఖరీదైనవిగా మారుతున్నాయి. స్విగ్గీ ఇటీవలి త్రైమాసికంలో రూ.1,197 కోట్ల వార్షిక నికర నష్టాన్ని నమోదు చేయగా, ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ ఫీజుల పెంపు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిణామం వల్ల ఫుడ్ డెలివరీ యాప్‌లపై ఆధారపడే వినియోగదారులకు, ఈ యాప్‌ల ద్వారా వ్యాపారం చేసే చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లకు భారం పెరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు మరింత ఖర్చు చేయాల్సి రావడం, రెస్టారెంట్లు అధిక కమిషన్లు చెల్లించాల్సి రావడం ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ భవిష్యత్తుపై కొత్త అనుమానాలను రేపుతున్నాయి.