Ilayaraja:చిరు సినిమాకు ఇళయరాజా సెగ? సుందరి పాట వాడకంపై ఫ్యాన్స్ టెన్షన్
Ilayaraja: చిరంజీవి తనయ సస్మిత కొణిదెల నిర్మించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో పర్మిషన్ లేకుండా పాట వాడి ఉంటే ఇళయరాజా రియాక్షన్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.
Ilayaraja
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ సినిమా సంక్రాంతి సందడిని ముందే తెచ్చేసింది. వింటేజ్ చిరంజీవి స్టైల్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే, సంక్రాంతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, ఒక చిన్న వివాదం కూడా అంతే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మూవీలో దళపతి సినిమాలోని సుందరి.. నేనే నీవంట అనే ఐకానిక్ పాటను నాలుగు చోట్ల వాడటమే ఈ చర్చకు కారణం. మ్యాస్ట్రో ఇళయరాజా తన పాటల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అందుకే, ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆయన ఎలా స్పందిస్తారు? నిజంగానే కేసు పెడతారా? లేక చిరంజీవితో ఉన్న అనుబంధంతో వదిలేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇళయరాజా (Ilayaraja ) తన సంగీతానికి సంబంధించి మేధో సంపత్తి హక్కుల (Intellectual Property Rights) కోసం గట్టిగా పోరాడుతున్నారు. గతంలో ఆయన పర్మిషన్ లేకుండా పాటలు వాడినప్పుడు చాలా కఠినంగా వ్యవహరించారు. ఆయన వేసిన ప్రధాన కేసుల లిస్టులలో..
మంజుమ్మెల్ బాయ్స్.. ఈ మలయాళ చిత్రంలో గుణ సినిమాలోని కన్మణి అన్బోడు పాటను వాడుకున్నందుకు ఆయన నోటీసులు ఇచ్చారు. చివరకు నిర్మాతలు 50 లక్షల రూపాయల సెటిల్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ & డ్యూడ్.. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాల్లో తన అనుమతి లేకుండా ఐదు పాటలు వాడినందుకు ఆయన మైత్రీ మూవీ మేకర్స్ పై నోటీసులు జారీ చేశారు. ఇటీవల డిసెంబర్ 2025లో మద్రాస్ హైకోర్టులో 50 లక్షల రూపాయల రాయల్టీ చెల్లించి ఈ కేసును సెటిల్ చేసుకున్నారు.కూలీ (రజనీకాంత్ సినిమా)..ఈ సినిమా టీజర్ లో తంగ మగన్ ట్యూన్ వాడినందుకు కూడా ఇళయరాజా (Ilayaraja ) నోటీసులు పంపారు. దీంతో మేకర్స్ ఆ టీజర్ ని ఎడిట్ చేయాల్సి వచ్చింది.
ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంపై.. ఇది అతిపెద్ద వివాదంగా నిలిచింది. తన ప్రాణ స్నేహితుడైన ఎస్‌పీబీ కచేరీలలో తన పాటలు పాడకూడదని నోటీసులు పంపడం అప్పట్లో ఇండస్ట్రీని ఎంత షాక్ కి గురి చేసిందో అందరికీ తెలిసిందే.
ఇక ఇటు చిరంజీవి , ఇళయరాజా (Ilayaraja) నాలుగు దశాబ్దాలుగా మంచి మిత్రులు.రుద్రవీణ, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ వంటి చిత్రాలకు ఇళయరాజా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చిరంజీవి కూడా ఇళయరాజాని జ్ఞాని అని, తన సినిమాల్లోని సాంగ్స్ సక్సెస్ లో ఆయన పాత్ర పెద్దదని ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇప్పుడు చిరంజీవి తనయ సస్మిత కొణిదెల నిర్మించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో పర్మిషన్ లేకుండా పాట వాడి ఉంటే ఇళయరాజా రియాక్షన్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.
చిరంజీవితో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల ఇళయరాజా కోర్టు వరకు వెళ్లే అవకాశం తక్కువని కొందరు అంటున్నారు. కానీ, ఇళయరాజా కాపీరైట్ ప్యాటర్న్ చూస్తే ఆయన స్నేహం కంటే హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. ఎస్‌పీబీ విషయంలోనే ఆయన వెనక్కి తగ్గలేదు కాబట్టి, ఇక్కడ కూడా కనీసం ఒక క్లారిఫికేషన్ అడిగే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ లేదా దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే లీగల్ గా పర్మిషన్ తీసుకుని ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.

నిర్మాతగా సుస్మిత కొణిదెల ఈ సినిమాకు సంబంధించి ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ పొరపాటున పర్మిషన్ లేకపోతే, మేకర్స్ ఇళయరాజాకి రాయల్టీ చెల్లించడం ఉత్తమ మార్గం. భారత కాపీరైట్ చట్టం 1957 ప్రకారం, పాట ఒరిజినల్ కంపోజర్ అనుమతి లేకుండా వాడటం నేరం.
రాయల్టీ చెల్లింపు.. పాట పాపులారిటీ ,వాడిన సమయాన్ని బట్టి 10 నుంచి 50 లక్షల వరకు రాయల్టీ ఉంటుంది.
క్రెడిట్ ఇవ్వడం.. సినిమా ఎండ్ టైటిల్స్ లో లేదా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఇళయరాజా గారికి తగిన గౌరవం (Credits) ఇవ్వడం ద్వారా కూడా వివాదాన్ని తగ్గించొచ్చు.
ప్రస్తుతానికి ఇళయరాజా నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కేవలం ఆయన పాత ట్రాక్ రికార్డ్ ఆధారంగానే సాగుతోంది. చిరంజీవి ఇమేజ్, ఆయనకు ఇళయరాజా పట్ల ఉన్న గౌరవం చూస్తుంటే, ఒకవేళ వివాదం తలెత్తినా అది పర్సనల్ గా సెటిల్ అయ్యే అవకాశాలే ఎక్కువ.
ఏదేమైనా, ఒక సూపర్ హిట్ సినిమాకు ఇలాంటి కాపీరైట్ చర్చలు రావడం అనేది అటు సినిమాకు పబ్లిసిటీ తెస్తున్నా, నిర్మాతలకు మాత్రం కొంచెం టెన్షన్ పెంచే విషయమే. రాబోయే రోజుల్లో చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Konaseema:సంక్రాంతికి అసలైన అందం కోనసీమే..పచ్చని ప్రకృతి మధ్య పండుగ సంబరాలు



