Singer Minmini: చిన్ని చిన్ని ఆశ గాయని మిన్మిని జీవితంలో ఆ షాకింగ్ మలుపే..
Singer Minmini: ‘రోజా’ సినిమాలో ఎ.ఆర్. రహమాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని తన స్వరంతో మంత్రంలా మార్చిన గాయని మిన్మిని, ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

Singer Minmini
చిన్ని చిన్ని ఆశ(Chinna Chinna Aasha).. ఈ పాట అప్పట్లో ఎంతోమంది గుండెలను తాకింది. ‘రోజా’ సినిమాలో ఎ.ఆర్. రహమాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని తన స్వరంతో మంత్రంలా మార్చిన గాయని మిన్మిని, ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ హిట్ తర్వాత ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక క్షణం… ఆమె కలల కెరీర్‌ను అర్ధాంతరంగా ఆపేసింది.
1993లో లండన్‌లో ఓ స్టేజ్ షో జరుగుతోంది. స్టేజీ మీద మిన్మి నిలబడి పాట పాడుతుండగా, ఒక్కసారిగా గొంతు పోయింది. ఆ క్షణం నుంచి ఆమె జీవితంలో అంధకారం మొదలైంది. పాట పాడటం మాత్రమే కాదు, మాట్లాడటమే కష్టమయ్యింది. కొన్నేళ్లకు గొంతు తిరిగి వచ్చినా, ఆఫర్లు రాక కెరీర్ మెల్లగా మూతపడింది.
తాజాగా మలయాళ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మిన్మి ఆ చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. 1991 నుంచి 1994 వరకు నా జీవితం రికార్డింగ్స్, మైక్, మ్యూజిక్ రూమ్‌లలోనే గడిచింది. చెన్నైలో ఉన్న పెద్ద పెద్ద సంగీత దర్శకులందరితో పాడాను. ‘రోజా’ పాట తర్వాత నా పేరు దేశమంతా మార్మోగింది. కానీ ఆశ్చర్యకరంగా ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ టైంలోనూ నన్ను మరచిపోకుండా అవకాశాలు ఇచ్చిన జాన్సన్ గారికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.”
మిన్మిని (Singer Minmini) ఆ రోజు జరిగిన మలుపు గురించి చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆమె కళ్లలో నీరు తిరిగింది ..
ఒక రోజు ఇళయరాజా గారి పాట రికార్డింగ్ కోసం వెళ్లాను. టేక్‌కు ముందు కరెక్షన్స్ చెప్పి వెళ్లిపోతూ, తిరిగి వచ్చి నన్ను చూస్తూ – ‘నువ్వెందుకు ఎక్కడెక్కడో పాడుతున్నావ్? ఇక్కడే పాడితే చాలు’ అన్నారు. ఆ మాట విని నేను షాక్ అయ్యాను. మైక్ ఆన్‌లో ఉండటంతో అందరూ విన్నారు. కన్నీళ్లు ఆగలేదు. పక్కనే ఉన్న మనో గారు ఓదార్చారు. కీబోర్డ్ ప్లేయర్ విజీ ఇమాన్యుయల్ వచ్చి ‘ఏడవొద్దు, ఆయన అలా అన్నది పట్టించుకోకు, నువ్వు పాడు’ అంటూ ధైర్యం చెప్పారు.

ఆ మాటలు, ఆ వాతావరణం… మిన్మిని మనసులో ముద్రపడి పోయాయి. “నా గొంతు పోవడానికి ఈ సంఘటన కారణమా తెలియదు కానీ, అప్పటి నుంచి వెంటాడుతోంది. ఆ తర్వాత ఇళయరాజా గారు మళ్లీ నన్ను పాడమని పిలవలేదు. కానీ ఆయన ఎప్పుడూ వాత్సల్యంగా ఉండేవారు. కానీ ఆ రోజు ఎందుకు అలా జరిగిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనని ఆమె చెప్పింది.
గొంతు పోయిన తర్వాత పాటలు ఆపేసిన మిన్మినికి 1994లో రహమాన్ గారి కాల్ వచ్చింది. ‘కరుత్తమ్మ’ కోసం రా, పాడు అని. “నా గొంతు బాగోలేదని చెప్పినా, ఆయన – ‘ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావ్ కదా, అదే గొంతుతో పాడు’ అని ప్రోత్సహించారు. ఆ నమ్మకంతోనే స్టూడియోకి వెళ్లి ఆ పాట పాడాను” అని మిన్మి భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.
ఒక పాట ఆమెకు (Singer Minmini)పేరు, గౌరవం ఇచ్చింది. కానీ ఒక సంఘటన, ఒక క్షణం… ఆ బంగారు స్వరాన్ని మౌనంగా మార్చేసింది.