Allu Cinemas: అల్లు అర్జున్ సరికొత్త సామ్రాజ్యం.. మహేష్ బాబు నుంచి బన్నీ వరకు అంతా ఒకే దారిలో ఎందుకు?
Allu Cinemas: అద్భుతమైన విజువల్ క్లారిటీ కోసం డాల్బీ విజన్ త్రీడీ ప్రొజెక్షన్ , సినిమా లోపలే ఉన్నామా అనే ఫీలింగ్ ఇచ్చేలా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అమర్చారు.
Allu Cinemas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు బిజినెస్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ తో కలిసి అమీర్ పేటలో ఏఏఏ థియేటర్‌ను విజయవంతంగా నడుపుతున్న బన్నీ . తన సొంత బ్రాండ్ అల్లు సినిమాస్‌తో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Cinemas)భాగస్వామ్యంలో 3 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. అమీర్ పేటలోని ఏఏఏ సినిమాస్ లో ఇప్పటికే అత్యాధునిక ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు కోకాపేటలో రాబోతున్న అల్లు సినిమాస్ ను 2026 సంక్రాంతి కానుకగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ లో కూడా మరో భారీ మల్టీప్లెక్స్ పనులు జరుగుతున్నాయి.
కోకాపేటలో నిర్మించిన ఈ (Allu Cinemas)మల్టీప్లెక్స్ ఒక టెక్నాలజీ వండర్ అని చెప్పాలి. ఇక్కడ దాదాపు 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ మూవీ స్క్రీన్ కావడం విశేషం. అద్భుతమైన విజువల్ క్లారిటీ కోసం డాల్బీ విజన్ త్రీడీ ప్రొజెక్షన్ , సినిమా లోపలే ఉన్నామా అనే ఫీలింగ్ ఇచ్చేలా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్(Allu Cinemas) అమర్చారు. హై ఎండ్ కస్టమర్ల కోసం రాయల్ ఇంటీరియర్స్ , సోఫా లాంటి కంఫర్టబుల్ సీటింగ్ ఇక్కడ ప్రత్యేకం.

మన టాలీవుడ్ టాప్ హీరోలు చాలామంది ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో రాణిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ తో మహేష్ బాబు ఈ ట్రెండ్ ను మొదలుపెట్టారు. ఇది దేశంలోనే అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అలాగే విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు.
ఇటీవల మాస్ రాజా రవితేజ కూడా ఏఆర్టీ సినిమాస్ పేరుతో ఈ ఫీల్డులోకి అడుగుపెట్టారు. విక్టరీ వెంకటేష్ కూడా ఏషియన్ సినిమాస్ తో కలిసి కొత్త మల్టీప్లెక్స్ పనుల్లో ఉన్నారు. ఇక రానా దగ్గుబాటి , సురేష్ బాబు కుటుంబానికి ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా వందల సంఖ్యలో థియేటర్ల నెట్వర్క్ ఉంది.
స్టార్ హీరోలు సినిమాల మీద వచ్చే రెమ్యునరేషన్ తో ఆగకుండా వ్యాపారాల వైపు వెళ్లడానికి బలమైన కారణాలు ఉన్నాయి. సినిమాల్లో విజయాలు, ఓటములతో సంబంధం లేకుండా థియేటర్ల ద్వారా ప్రతి నెలా స్థిరమైన ఇన్కమ్ వస్తుంది. దీనికితోడు మల్టీప్లెక్స్ లు నిర్మించే ప్రాంతాల్లో భూమి విలువ కాలక్రమేణా భారీగా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక సేఫ్టీ ఇన్వెస్ట్‌మెంటుగా భావిస్తున్నారు. ఇంకా చెప్పాంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో సెలబ్రెటీలు ఉన్నారు. దానికి కాస్త ట్రెండ్ ను యాడ్ చేస్తూ నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు.
అంతేకాదు హీరో పేరు మీద థియేటర్ ఉంటే ఆ క్రేజ్ వల్ల ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తారు. దీనివల్ల హీరో బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. సొంత థియేటర్లు ఉండటం వల్ల తమ సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల సమస్య ఉండదు .. డిస్ట్రిబ్యూషన్ లో పట్టు ఉంటుంది. అందుకే మన స్టార్లు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఇలాంటి బిజినెస్ సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు.



