impeachment: ఇంపీచ్మెంట్ దారిలో జస్టిస్ వర్మ.. భారత రాజ్యాంగం ఏం చెబుతోంది…?
impeachment: భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు , హైకోర్టు న్యాయమూర్తులను వారి పదవి నుంచి తొలగించే విధానాన్ని చాలా పకడ్బందీగా రూపొందించింది.

impeachment: భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక అసాధారణమైన ఘట్టానికి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై తీవ్ర ఆరోపణలు, ముఖ్యంగా ఆయన అధికారిక నివాసంలో “లెక్కల్లో లేని నగదు కట్టలు” (Cash Seizure Scandal) దొరికినట్లు వచ్చిన వార్తలు, కేంద్ర ప్రభుత్వాన్ని కీలక నిర్ణయం వైపు నడిపిస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కేంద్రం ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం (Impeachment Motion) ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనదని, అనేక చట్టబద్ధమైన దశలను దాటాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు , పార్లమెంటరీ వర్గాలు చెబుతున్నాయి.
Impeachment Motion
న్యాయమూర్తుల తొలగింపు: భారత రాజ్యాంగం ఏం చెబుతుంది?
భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు , హైకోర్టు న్యాయమూర్తులను వారి పదవి నుంచి తొలగించే విధానాన్ని చాలా పకడ్బందీగా రూపొందించింది. ఇది కేవలం ఆరోపణల ఆధారంగా జరిగే ప్రక్రియ కాదు, చట్టబద్ధమైన పారదర్శకత , కఠినమైన రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ఆర్టికల్స్ 124(4) , 124(5) ఈ ప్రక్రియకు సంబంధించిన కీలక విధులను వివరిస్తాయి. న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలంటే “నిరూపితమైన దుష్ప్రవర్తన” లేదా “అసమర్థత” కారణాలు ఉండాలి.
అభిశంసన ప్రక్రియలో కీలక దశలు:
తీర్మానం ప్రవేశపెట్టడం: ఒక న్యాయమూర్తిని తొలగించాలనే తీర్మానాన్ని లోక్‌సభలో లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు.
లోక్‌సభలో అయితే కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో అయితే కనీసం 50 మంది ఎంపీలు తీర్మానంపై సంతకాలు చేసి ఇవ్వాలి.
సంతకాలు చేసిన తీర్మానం లోక్‌సభ స్పీకర్‌కు లేదా రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించబడుతుంది.
విచారణ కమిటీ ఏర్పాటు:
స్పీకర్/ఛైర్మన్ ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే, వారు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , ఒక విశిష్ట న్యాయవాది ఉంటారు.
ఈ కమిటీ ఆరోపణలపై లోతుగా విచారణ చేస్తుంది, సాక్ష్యాలను పరిశీలిస్తుంది అలాగే సంబంధిత న్యాయమూర్తికి తన వాదన వినిపించుకునే అవకాశం కల్పిస్తుంది.
కమిటీ తమ నివేదికను స్పీకర్/ఛైర్మన్‌కు సమర్పిస్తుంది. కమిటీ ఆరోపణలను నిరూపించగలిగితేనే తదుపరి చర్యలు జరుగుతాయి.
పార్లమెంటులో చర్చ, ఓటింగ్:
దర్యాప్తు కమిటీ ఆరోపణలను నిజమని నివేదిస్తే, తీర్మానం పార్లమెంటులోని రెండు సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) ఓటింగ్ కోసం ప్రవేశపెట్టబడుతుంది.
ఈ దశలో అత్యంత కీలకమైనది “ప్రత్యేక మెజారిటీ” (Special Majority). రెండు సభలూ ఈ తీర్మానానికి ప్రత్యేక మెజారిటీతో మద్దతు ఇవ్వాలి. అంటే:
ఆ సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (అంటే, సగం మందికి పైగా సభ్యులు) మద్దతుగా ఉండాలి. సభలో హాజరై, ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడు వంతులు (2/3) తీర్మానానికి మద్దతుగా ఓటు వేయాలి. ఈ కఠినమైన మెజారిటీ నిబంధన న్యాయమూర్తుల తొలగింపును అత్యంత అరుదైనదిగా చేస్తుంది.
రాష్ట్రపతి ఆదేశం :
రెండు సభలూ ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, భారత రాష్ట్రపతి (President) ఆ న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే ఆదేశాన్ని జారీ చేస్తారు. అప్పుడే న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది.
చరిత్రలో నిలిచిన ఇంపీచ్మెంట్ ఘటనలు..
భారత చరిత్రలో ఇప్పటివరకు చాలా సందర్భాల్లో న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియ మొదలైంది. అయితే, ఏ ఒక్క న్యాయమూర్తిని కూడా పార్లమెంటు ఓటింగ్ ద్వారా పూర్తిగా తొలగించలేదు. చాలా మంది న్యాయమూర్తులు ప్రక్రియ ముగియకముందే రాజీనామా చేశారు.
1993 – వి. రామస్వామి: భారత చరిత్రలో ఇంపీచ్మెంట్ మొదలైన మొట్టమొదటి న్యాయమూర్తి ఈయన. లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టినా, అవసరమైన మూడవంతుల మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదు.
2011 – సౌమిత్ర సేన్: రాజ్యసభలో తొలిసారిగా ఇంపీచ్మెంట్ తీర్మానం ఆమోదించబడిన న్యాయమూర్తి ఈయన. అయితే, తదుపరి చర్యలు తీసుకునేలోపే ఆయన రాజీనామా చేసి పదవి నుంచి వైదొలిగారు.
2015 – జె.బి. పడీవాలా: రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి, దీనిపై నోటీసు జారీ చేయబడింది.
2015 – ఎస్.కె. గంగేలే: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, విచారణ కమిటీ సాక్ష్యాధారాలు లేవని తేల్చడంతో తీర్మానం ఉపసంహరించబడింది.
2017 – సి.వి. నాగార్జున రెడ్డి: ఇంపీచ్మెంట్ కోసం తీర్మానం ప్రవేశపెట్టబడింది.
2018 – దీపక్ మిశ్రా (సీజేఐ): ప్రతిపక్ష పార్టీలు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇంపీచ్మెంట్ డ్రాఫ్ట్‌ను సంతకాలతో తయారు చేశాయి, కానీ అది కార్యరూపం దాల్చలేదు.
అభిశంసనకు ముందే రాజీనామా చేసిన ముఖ్య న్యాయమూర్తులు:
న్యాయమూర్తులపై దుష్ప్రవర్తన లేదా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, లేదా అభిశంసన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, పార్లమెంటులో ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసి బయటపడిన సందర్భాలు ఉన్నాయి.
పి.డి. దినకరణ (P.D. Dinakaran) (2011): భూకబ్జా, అవినీతి, న్యాయపదవి దుర్వినియోగం చేశారన్న తీవ్ర ఆరోపణలతో విచారణ మొదలయ్యేలోపే ఆయన రాజీనామా చేసి పదవి నుంచి వైదొలిగారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం, పార్లమెంటులో ఎలాంటి మద్దతు లభిస్తుంది, ఈ సుదీర్ఘ, సంక్లిష్టమైన రాజ్యాంగ ప్రక్రియ ఎలా ముగుస్తుందనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత న్యాయవ్యవస్థ (Indian Judiciary) స్వచ్ఛత, పారదర్శకతను నిలబెట్టేందుకు ఇది ఒక కీలకమైన పరీక్షగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.