Nimisha Priya:నిమిషాల్లో ఆగిన నిమిషాప్రియ ఉరి శిక్ష నిర్ణయం.. ఎలా అంటే?
Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష పడిన కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ కేసు సినిమా స్టోరీని తలపించేలా అనూహ్య మలుపు తిరిగింది.

Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష పడిన కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ కేసు సినిమా స్టోరీని తలపించేలా అనూహ్య మలుపు తిరిగింది. మరణశిక్ష అమలుకు కేవలం కొన్ని నిమిషాల ముందు యెమెన్ ప్రభుత్వం ఆమె మరణదండన నిర్ణయాన్ని వాయిదా వేసింది.
Nimisha Priya
ఈ షాకింగ్ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది, నిమిషా ప్రియ కుటుంబానికి, ఆమెను రక్షించడానికి కృషి చేస్తున్న భారత్‌కు ఊరటనిచ్చింది. మృత్యుముఖం నుంచి తప్పించుకున్న నిమిషా ప్రియ జీవితానికి ఇది ఒక కొత్త ఆశను చిగురింపజేసింది.
నిమిషా ప్రియ కేసు ..ఒక విషాద గాథ
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya) 2011లో ఉపాధి కోసం యెమెన్‌కు వెళ్లింది. 2014లో యెమెన్(Yemen)లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త, కుమార్తె భారతదేశానికి తిరిగి వచ్చారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి నిమిషా ప్రియ యెమెన్‌లోనే ఉండిపోయింది.
యెమెన్ చట్టాల ప్రకారం, విదేశీ వైద్య నిపుణులు అక్కడ క్లినిక్ తెరవాలంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. దీనికోసం నిమిషా ప్రియ తలాల్ అబ్దు మహ్మద్ అబ్దీ అనే వ్యక్తితో వ్యాపారం ప్రారంభించింది. అయితే, ఆ తర్వాతే అతని నిజస్వరూపం నిమిషా ప్రియకు తెలిసింది.
నిమిషా ప్రియ ఆరోపణల ప్రకారం, తలాల్ అబ్దు మహ్మద్ అబ్దీ ఆమెను వివాహం చేసుకున్నట్లు తప్పుడు పత్రాలను సృష్టించాడు. ఆమె పాస్‌పోర్ట్‌ను నిలిపివేశాడు. ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడు. ఆర్థిక దోపిడీకి, పదే పదే బెదిరింపులకు గురిచేశాడు.
2017లో, తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొంది యెమెన్‌ను విడిచి వెళ్లాలనే లక్ష్యంతో, తలాల్ మహదీని మత్తు మందు ఇచ్చి పారిపోవడానికి నిమిషా ప్రియ ప్రయత్నించింది. అయితే, దురదృష్టవశాత్తు,ఆమె అతనికి ఇచ్చిన మత్తు అధిక మోతాదు కావడంతో తలాల్ అబ్దో మహదీ చనిపోయాడు.
అయితే అక్కడే ఆమె మరో తప్పు చేసినట్లు.. తలాల్ అబ్దో మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసినట్లు నిమిషా ప్రియపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2020లో యెమెన్ న్యాయస్థానం ప్రియకు మరణశిక్ష విధించగా, 2023లో హూతీల సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఆ మరణశిక్షను సమర్థించింది.
‘బ్లడ్ మనీ’పై మత గురువుతో రాయబారం
నిమిషా ప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు ఉన్న ఏకైక మార్గం బ్లడ్ మనీ(blood money)అంటే క్షమాధనం. యెమెన్‌లో అమల్లో ఉన్న షరియా చట్టాల ప్రకారం, నేరం రుజువైన తర్వాత కూడా బాధితుడి కుటుంబం క్షమాధనం స్వీకరించడానికి అంగీకరిస్తే, దోషికి శిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఉరిశిక్షకు కొన్ని నిమిషాల ముందు ఈ కేసులో ఓ అద్భుతం జరిగింది. భారత ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాలతో పాటు, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఈ కేసులో కీలక మధ్యవర్తిత్వం వహించారు. నిమిషా ప్రియ తరఫు న్యాయవాది శుభాష్ చంద్రన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మత గురువు ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపారు. యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో కూడా నిమిషా ప్రియ లాయర్ మాట్లాడారు.
బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. నిమిషా ప్రియ కుటుంబం నుంచి మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8.6 కోట్లు) బ్లడ్ మనీని బాధిత కుటుంబానికి తీసుకోవడానికి సిద్ధం అయినట్లు సమాచారం. దీంతోనే చివరి నిమిషంలో యెమెన్ ప్రభుత్వం నిమిషా ప్రియ మరణశిక్ష నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
గతేడాది నిమిషా ప్రియ తల్లి ప్రేమకుమారి కూడా యెమెన్ వెళ్లి, తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
పూర్తి విడుదల వైపు ఆశలు..
ఉరిశిక్ష ఆగడం అనేది నిమిషా ప్రియకు ఒక పెద్ద ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. నిమిషా ప్రియ పూర్తిగా విడుదల కావాలంటే, తలాల్ కుటుంబం “బ్లడ్ మనీ”ని స్వీకరించడానికి అంగీకరించి, ఆమెను క్షమించాలి. లేదా, యెమెన్ ప్రభుత్వ స్థాయిలో పూర్తిస్థాయి క్షమాభిక్ష లభించాలి.
భారత ప్రభుత్వం, నిమిషా ప్రియకు మద్దతు ఇస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మరియు ఆమె కుటుంబం ఇప్పుడు ఈ బ్లడ్ మనీ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి, మరియు బాధితుల కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఒప్పించడానికి తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తాయి.మొత్తంగా ఈ మానవీయ కథలో తదుపరి అధ్యాయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది.