MS Bhaskar : 67 ఏళ్ల వయసులో 38 ఏళ్ల ఎదురుచూపు తర్వాత ఒక జాతీయ అవార్డు !
MS Bhaskar : 38 ఏళ్ల నిరీక్షణకు తగ్గ ఫలితం: ఎం.ఎస్. భాస్కర్‌కు జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డు

MS Bhaskar
నిజమైన ప్రతిభ ఎప్పటికైనా వెలుగులోకి రావాల్సిందే. ఒకవేళ ఆలస్యమైనా… అది ఎదురయ్యే శబ్దం మాత్రం దేశం మొత్తం వినిపిస్తుంది. కాకపోతే కొన్నిసార్లు ఆ కలను నెరవేర్చుకోవడానికి అర్ధజీవితం వెచ్చించాల్సి వస్తుంది. అలాంటిదే ఎం.ఎస్. భాస్కర్ కథ.
ఈ రోజు భాస్కర్ వయసు 67 ఏళ్లు. కానీ ఒకసారి చూస్తే.. ఆయనకు జాతీయ ఉత్తమ సహాయనటుడు అవార్డు దక్కడానికి 38 ఏళ్లు పట్టింది!
1987లో తమిళ దర్శకుడు విసు తీసిన ‘తిరుమతి ఒరు వెగుమతి’ సినిమాలో చిన్నపాటి పాత్రలో తొలిసారి కనిపించారు. అదే చిత్రం తెలుగులో శ్రీమతి ఓ బహుమతి గా విడుదలైంది. అప్పుడు భాస్కర్ వయసు కేవలం ముప్పై దాటి ఉండొచ్చు. అందులో అతడిని చూసినవారెవ్వరూ .. ఆ నటుడు నాలుగు దశాబ్దాల తర్వాత జాతీయ అవార్డును అందుకుంటాడని ఊహించలేరు.
పూర్తి పేరు – ముత్తుపెట్టై సోము భాస్కర్(MS Bhaskar ). ముత్తుపెట్టై అన్నది ఆయన పుట్టిన ఊరు, సోము భాస్కర్ అన్నది అసలు పేరు. ఈయన సినీ ప్రయాణం 1987లో తమిళ దర్శకుడు విసు తీసిన చిత్రంతో మొదలైంది. అదే సినిమా తెలుగులో శ్రీమతి ఓ బహుమతిగా విడుదలైంది. ఆ సమయంలో ఆయన నటించినది చిన్న పాత్రే. కానీ అంతలో ఎవరు ఊహించగలరు, ఇదే నటుడు 37 ఏళ్ల తర్వాత జాతీయ పురస్కారం అందుకుంటాడని?
అప్పట్లో నాటకాలు తప్ప మరేదీ అవకాశం కాదు. కానీ ఆ నాటకాల్లోనే ఆయన ప్రతిభను చూసిన విసు, తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలు వచ్చినా, పాత్రలు గుర్తింపు తెచ్చిపెట్టేవి కావు. 2004 వరకూ ఆయనకు నిజంగా కెరీర్‌లో బ్రేక్ రాలేదు. మధ్యలో జీవనోపాధికోసం LIC ఏజెంట్‌గా పనిచేశారు. టూత్‌పేస్ట్ కంపెనీలోనూ పని చేశారు. కానీ నటనను వదలలేదు.
2004లో వచ్చిన ‘ఎంగల్ అన్నా‘ (తెలుగులో ‘ఖుషీఖుషీగా’) సినిమాతో ఆయనకి ఆ తొలి బ్రేక్ వచ్చింది. తర్వాత వరుసగా కామెడీ వేషాలు వచ్చాయి. మంచి గుర్తింపు మాత్రం 2007లో ‘మొళి’ అనే సినిమాలో వచ్చింది. ఆ సినిమాలో తన కొడుకును కోల్పోయిన ఓ ప్రొఫెసర్ పాత్రకు మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా అవార్డు కూడా ఇచ్చింది.
ఇలా ఆగకుండా 2017లో ‘8 బుల్లెట్స్’ అనే సినిమాలో ఉద్యోగం పోయిన కానిస్టేబుల్‌గా నటించారు. తెలుగులో అదే సినిమా సేనాపతిగా వచ్చింది. తమిళంలో భాస్కర్, తెలుగులో రాజేంద్ర ప్రసాద్… ఇద్దరూ అదరగొట్టారు. అప్పట్నుంచి భాస్కర్‌ని చూసే దృష్టి మారిపోయింది. కామెడీకి మాత్రమే కాదు… సీరియస్ పాత్రలకీ సూట్ అవుతాడని అందరికీ అర్థమైంది.
అంతలో దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్, తన కొత్త సినిమా ‘పార్కింగ్’ కోసం యాక్టింగ్ కాంబినేషన్ చూస్తుండగా, భాస్కర్‌కి పాత్ర కచ్చితంగా సరిపోతుందని ఫిక్సయ్యాడు. అందులో ఇంటి ముందు పార్కింగ్ గురించి గొడవపడి, పట్టుదలతో ఎదురొడ్డి, చివరికి ఇంట్లోనే అపహాస్యం ఎదుర్కొన్న ఓ stubborn ఇంటిపెద్ద పాత్ర – అదే ఇళంపరుతి పాత్ర. భాస్కర్ ఆ పాత్రలో జీవించాడు అనాల్సిందే. అందుకే ఇప్పుడాయనకు 2023 ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డు వచ్చి పడింది.

ఇప్పటివరకు ఆయన 200కి పైగా సినిమాల్లో నటించారు. పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమిళ డబ్బింగ్ సినిమాలో బ్రహ్మానందం వాయిస్‌ను భాస్కర్‌నే అనేకసార్లు డబ్బింగ్ చేశారు. ‘బొబ్బిలిరాజా’ నుంచి ‘ఖుషీ’ వరకు అనేక సినిమాలో ఆయన గొంతే వినిపించేది. ఆయన తన స్టార్‌డమ్‌లో ఉన్నప్పటికీ, బ్రహ్మానందం కోసం గొంతు ఇచ్చి ఆయనపై గౌరవం చూపారు.

ఇంతే కాదు, భాస్కర్(MS Bhaskar )కుమారుడు ఆదిత్య భాస్కర్ కూడా నటుడే. ఆయన ‘96’ సినిమాలో విజయ్ సేతుపతి చిన్నప్పటి పాత్ర చేశాడు. అంటే నటన వారసత్వంగా కూడా ఉంది.
ఇప్పుడు భాస్కర్ వయసు 67 ఏళ్లు. నటనలో ప్రయాణం 37 ఏళ్ల పైనే. అంతకాలం పాటు అవకాశాల కోసం కష్టపడటం… గుర్తింపుతో పాటు అవార్డు కూడా రావడం అంటే చిన్న విషయం కాదు.
అసలు ప్రతిభ అస్తమించదని, కాలమే దానికి అవార్డు ఇస్తుందన్నది భాస్కర్ కథలో రాసిపెట్టి ఉంది. భాస్కర్ ఈ తరం నటులకు నిలువెత్తు స్పూర్తి. ఎందుకంటే .. గొప్ప నటుడు అవ్వడానికి గ్లామర్ అవసరం లేదు. ఓపిక, పట్టుదల, ప్రతిభ ఉంటే చాలు అన్నది ఇతను ప్రూవ్ చేశారు.
Also Read: Anasuya : చెప్పు తెగుద్ది..అనసూయ ఘాటు వార్నింగ్