OG: ఫ్యాన్స్ ఆకలి తీర్చేసిన సుజిత్ పవన్ ఓజీ మూవీ రివ్యూ
OG: సినిమా మొదలైన అరగంట తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది... గత సినిమాలతో పోలిస్తే పవన్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి.

OG
ఓజీ…ఓజీ..ఓజీ(OG)… ఈ మూవీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతీచోటా వినిపించిన స్లోగన్స్ ఇవి… గత రెండేళ్ళ కాలంలో ఈ మూవీకి వచ్చిన హైప్, అంచనాలు మరే సినిమాకు రాలేదన్నది వాస్తవం.. సాహో మూవీతో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కిన ఓజీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి… మరి ఎన్నో అంచనాలతో రిలీజైన ఓజీ మూవీ ఎలా ఉంది… రివ్యూలో చూద్దాం…
బాగా ఆకలిగా ఉన్నవాడికి ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుంది… సరిగ్గా అదే తరహాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది ఓజీ మూవీ… ఒక్క మాటలో చెప్పాలంటే ఒక డైహార్డ్ ఫ్యాన్ తాను ఆరాధించే హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓజీ…సాధారణంగా ఫ్యాన్స్ తమ హీరోను ఎలా చూడాలనుకుంటారో….ఎలాంటి ఫైట్స్.. ఎలాంటి ఎలివేషన్ కావాలనుకుంటారో… సరిగ్గా వాటన్నింటినీ వందకు వంద శాతం చూపించాడు డైరెక్టర్ సుజిత్….నిజానికి మిగిలిన హీరోలతో పోలిస్తే పవన్ ఇమేజ్ చాలా డిఫెరెంట్… హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇమేజ్ పెరుగుతూ పోయిన హీరో పవన్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. పవన్ పెద్ద హిట్ కొట్టి పన్నెండేళ్లు దాటినా ఇమేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు… అలాంటి హీరోకు అభిమానిగా ఉన్న సుజిత్ ఓజీతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశాడు.

కథ గురించి చెప్పాలంటే రొటీన్ మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీనే… కొన్నాళ్ళ పాటు మాఫియాలో కీలకంగా ఉన్న హీరో దానిని వదిలేసి వేరే చోట సాధారణ జీవితం గడపడం… మళ్ళీ తన వాళ్ళకు తన అవసరం వచ్చిందని తిరిగి మాఫియాలోకి రీఎంట్రీ ఇవ్వడం.. విలన్ కు చెక్ పెట్టడం… ఈ లైన్స్ తో గతంలో భాషా , పంజా వంటి మూవీస్ లో చూసినవే… అయితే డైరెక్టర్ సుజిత్ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. రొటీన్ స్టోరీనే కాస్త డిఫరెంట్ గా స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేసి మార్కులు కొట్టేశాడు. జపాన్ లో మొదలైన కథ ముంబైకి వచ్చిన తర్వాత మొత్తం పవన్ చుట్టూనే తిరుగుతుంది. తన వాళ్ళ కోసం మళ్ళీ మాఫియాలోకి వచ్చి వారందరి కోసం ఏం చేశాడనేదే ఓజీ కథ…
నటీనటుల విషయానికొస్తే ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో… సినిమా మొదలైన అరగంట తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది… గత సినిమాలతో పోలిస్తే పవన్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ ఎంట్రీ సీన్ టైమ్ ఫ్యాన్స్ కు పూనకాలే…ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్ బ్లాంక్…అయితే కథ అక్కడక్కడా స్లో అయినట్టు కనిపించినప్పుడల్లా పవన్ ను ఎలివేట్ చేస్తూ సీన్లు రావడం సినిమాకు ప్లస్ పాయింట్… లాజిక్కులు లేకుండా , కథను ఎక్కువ పట్టించుకోకుండా పూర్తిగా పవన్ ఇమేజ్ , ఆయన ఫ్యాన్స్ కోసం ఓజీని అద్భుతంగా తెరకెక్కించడంలో సుజిత్ వంద శాతం సక్సెసయ్యాడు. ముఖ్యంగా ఈ మూవీలో పవన్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. కటానా(కత్తి), గన్స్ తో పవన్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ సీన్లు ఉన్నా వాటిని న్యాచురల్ గా చూపించడంలోనూ ఓజీ(OG) టీమ్ సక్సెస్ అయింది. సహజంగానే మార్షల్ ఆర్ట్స్ మెళుకువలు తెలిసిన పవన్ ఆ సీన్స్ లో దుమ్మురేపారు. గత రెండు మూడు సినిమాలతో పోలిస్తే పవన్ ఓజీలో వింటేజ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను అలరించాడనే చెప్పాలి. ఇక పోలీస్ స్టేషన్ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలుస్తుంది.
హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉందని చాలా సింపుల్ గా చూపించేసిన తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ లోకి వెళ్ళిపోయాడు. బహుశా కథ లెంగ్త్ పెరుగుతుందని ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ పెట్టుండకపోవచ్చు. పవన్ తో ప్రియాంక అరుల్ మోహన్ కెమిస్ట్రీ బాగుంది. అటు ఓమి పాత్రలో వినల్ గా ఇమ్రాన్ హష్మి అదరగొట్టాడు. పవన్ కు ధీటుగా యాక్ట్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఇక కీలక పాత్రల్లో నటించిన ప్రకాశ్ రాజ్, శ్రేయారెడ్డి , శుభలేఖ సుధాకర్, అర్జున్ దాస్ తమ పరిధిలో బాగా నటించారు. ఇదిలా ఉంటే ఓజీ మూవీకి మరో బలం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన బీజీఎం… ముఖ్యంగా పవన్ ను ఎలివేట్ చేస్తూ కనిపించిన సీన్స్ లో థమన్ తన బీజీఎంతో మరో రేంజ్ కు తీసుకెళ్ళాడు. అటు టెక్నికల్ పరంగానూ మంచి మార్కులే పడ్డాయి. 1980 రోజుల్లో కథ కావడంతో సినిమాటోగ్రఫీ వర్క్ బాగా కుదిరింది.ఆర్ట్ డిపార్ట్ మెంట్, ఫొటోగ్రఫీ టీమ్ పడిన కష్టం తెరపై కనిపించింది.
మరోవైపు నిర్మాతలు పవన్ కు ఉన్న క్రేజ్, సుజిత్ టేకింగ్ మీద నమ్మకంగా బాగా ఖర్చు పెట్టారు. వారు పెట్టిన ఖర్ఛు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఓజీ(OG) సినిమాలో పవన్…థమన్…సుజిత్ ఈ ముగ్గురినీ హీరోలుగా చెప్పొచ్చు. చాలా ఏళ్ళుగా పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా చూపించిన సుజిత్ మరోసారి తన టేకింగ్ పై ప్రశంసలు అందుకున్నాడు. చివరిగా ఓజీ వింటేజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తూ అలరించే యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు.
3 Comments