Just InternationalLatest News

Cyclone Ditwah: శ్రీలంకలో దిత్వా విధ్వంసం.. తుపాను దెబ్బకు ఎమర్జెన్సీ

Cyclone Ditwah: దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే దేశమంతటా ఎమర్జెన్సీని ప్రకటించారు.

Cyclone Ditwah

ప్రకృతి విలయతాండవంతో శ్రీలంక అల్లకల్లోలమైంది. గత వారం రోజులుగా భారత్ కు సైతం నిద్ర లేకుండా చేసిన
దిత్వా తుపాను(Cyclone Ditwah) శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. వాతావరణశాఖ అధికారులు ఊహించినట్టుగానే దిత్వా దెబ్బకు శ్రీలంకలోని చాలా ప్రాంతాలు కొట్టుకుపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తుపాను(Cyclone Ditwah) విరుచుకుపడడంతో ఇళ్లు, రోడ్లే కాదు బ్రిడ్జీలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకూ 150 మందికి పైగా వందల సంఖ్యలో జనం గల్లంతయ్యారు.

దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే దేశమంతటా ఎమర్జెన్సీని ప్రకటించారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదల చేశారు. తుపాను ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని అంచనా వేసినప్పటికీ సరైన రీతిలో రక్షణ చర్యలు తీసుకోలేదని భావిస్తున్నారు.

ప్రతిపక్ష నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే వారి డిమాండ్ మేరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించడంతో ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి పోలీసులు, ఆర్మీ, మెడికల్ సిబ్బంది, ఇతర రంగాలకు చెందిన సిబ్బందిని రంగంలోకి దింపారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు.

Cyclone Ditwah
Cyclone Ditwah

తుపాను తీరం దాటక ముందే శ్రీలంకతో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. గత రెండురోజులుగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ముందే ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం భారీగా జరగకుండా నివారించగలిగామని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తుపాను (Cyclone Ditwah)దెబ్బకు తీవ్ర నష్టాన్ని చవిచూసిన శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. సహాయక చర్యల కోసం ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నుంచి హెలికాప్టర్లను పంపించింది. మరోవైపు తుపాను విధ్వంసానికి 12 లక్షలకు పైగా కుటుంబాలు ప్రభావితమైనట్టు తెలుస్తోంది. 500కు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు , రెస్క్యూ సిబ్బంది వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా శ్రీలంకలో చాలా ప్రాంతాలను నామరూపాల్లేకుండా చేసిన దిత్వా తుపాను ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలవైపు దూసుకొస్తోంది. గంటకు 8 కి.మీ. వేగంతో వస్తున్న దిత్వా ఆదివారం ఉత్తర తమిళనాడును తాకే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ తుపాను ప్రభావం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button