Gold price: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ సమయంలో గోల్డ్ కొనొచ్చా?
బంగారం ధర(Gold price)ల్లో తగ్గుదల కేవలం దేశీయ మార్కెట్లను మాత్రమే కాకుండా, అంతర్జాతీయ పరిస్థితులను కూడా సూచిస్తుంది. ఈ తగ్గుదలకు ప్రధానంగా నాలుగు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు.

Gold price
మన దేశంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండగ వచ్చినా.. బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం. అందుకే బంగారానికి ఇక్కడ ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే ఉంటుంది. అయితే, కొంత కాలంగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు.. వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన మూడు రోజులుగా అయితే పసిడి ధరలు మరీ తగ్గుతూ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి.
ఈరోజు కూడా ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,750, ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,180 గా ఉంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్లపై రూ.140, 24 క్యారెట్లపై రూ.160 తగ్గాయి. కానీ వెండి ధర మాత్రం కిలోకు రూ.100 పెరిగి రూ.1,26,200కి చేరింది.
బంగారం ధర(Gold price)ల్లో తగ్గుదల కేవలం దేశీయ మార్కెట్లను మాత్రమే కాకుండా, అంతర్జాతీయ పరిస్థితులను కూడా సూచిస్తుంది. ఈ తగ్గుదలకు ప్రధానంగా నాలుగు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు.
సాధారణంగా యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై దృష్టి పెడతారు. కానీ, ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ప్రపంచ దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనడం వల్ల బంగారంపై డిమాండ్ తగ్గింది.
అమెరికా, జపాన్ వంటి అగ్రరాజ్యాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరి, మార్కెట్లో ఉద్రిక్తతలు తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్ముకొని ఇతర లాభదాయక ఆస్తుల వైపు మళ్లుతున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల, బంగారంపై పెట్టుబడులు తగ్గించేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు తగ్గుతున్నాయి.అలాగే భారతదేశంలో పండుగల సీజన్ ముగియడంతో తాత్కాలికంగా బంగారం కొనుగోలు డిమాండ్ తగ్గుతుంది. ఇది కూడా దేశీయంగా ధరలు తగ్గడానికి ఇదీ కూడా ఒక కారణమే.
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రియులకు ఊరట కలిగించినా, ఇది తాత్కాలికమేనా లేదా దీర్ఘకాలికంగా ఉంటుందా అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ ఒడిదుడుకులు పెరిగితే, బంగారం ధరలు తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా, ప్రస్తుతానికి బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి సమయమని చెప్పవచ్చు.