Duck Hawk : డక్ హాక్ బర్డ్ గురించి విన్నారా అసలు..?
Duck Hawk : క్షణాల్లో కనుమరుగయ్యే వేగం, గాలిలో మెరుపులా దూసుకుపోయే నైపుణ్యం, వేటలో దాని అద్భుతమైన చాతుర్యం చూస్తే ఎవరైనా షాక్ అవుతారు

Duck Hawk: క్షణాల్లో కనుమరుగయ్యే వేగం, గాలిలో మెరుపులా దూసుకుపోయే నైపుణ్యం, వేటలో దాని అద్భుతమైన చాతుర్యం చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఈ అద్భుత పక్షి చేసే విన్యాసాలు, దాని వేటాడే విధానం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే ఈ పక్షి పేరే ..పెరెగ్రైన్ ఫాల్కన్. దీనిని ‘డక్ హాక్’ అని కూడా అంటారు. గగనతలంలో ఇది చేసే విన్యాసాలు, వేటాడే విధానం చూస్తే కచ్చితంగా వావ్ అంటారు.
Duck Hawk
ఈ పక్షి వేగం వెనుక రహస్యం పెరెగ్రైన్ ఫాల్కన్ అద్భుత శరీర నిర్మాణమేనట. నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికల ప్రకారం, పెరెగ్రైన్ ఫాల్కన్ గంటకు 389 కిలోమీటర్ల (242 mph) వరకు గరిష్ట వేగంతో దూసుకెళ్లిపోతుందట. ఇది భూమిపై ఏ ఇతర పక్షికీ సాధ్యం కాని వేగం. మరి ఇంత వేగంగా ఎలా ఎగురుతుందనే దానిపై శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా పరిశోధనలు చేశారు. చివరకు దాని ప్రత్యేకమైన రెక్కలు ఎముకల నిర్మాణమే ఈ అద్భుతానికి కారణమని తేల్చారు.
పెరెగ్రైన్ ఫాల్కన్ శరీరంలో ఉండే కీల్ ఎముక చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది దాని పొడవైన, శక్తివంతమైన రెక్కలను అత్యంత వేగంగా కదిలించడానికి సహాయపడుతుంది. గాలిలో అల్ట్రా-డైనమిక్‌గా కదలడానికి వీలుగా దీని శరీరం సన్నగా, బూడిద రంగులో ఉంటుంది. ఇది దాదాపు 36 నుంచి 49 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.
ఈ పక్షి అతి పెద్ద లక్షణం ఏంటంటే, ఇది ఎగురుతూ జీవించే పక్షులను వేటాడి తింటుంది. ఆకాశంలో ఎగురుతున్న పక్షిని మెరుపు వేగంతో వెంబడించి, ఒక్క దూకుతో పట్టుకుంటుంది. ఈ పక్షి ధ్రువ ప్రాంతాలు మినహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో కనిపిస్తుంది. ఆడ పెరెగ్రైన్ ఫాల్కన్స్ మగవాటి కంటే పరిమాణంలో కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆశ్చర్యకరంగా, ఇవి పుట్టిన ఒక సంవత్సరంలోనే పునరుత్పత్తికి సిద్ధంగా ఉంటాయి.
దురదృష్టవశాత్తూ, చాలా ప్రాంతాల్లో ఈ పెరెగ్రైన్ ఫాల్కన్స్ సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. కొన్ని నివేదికల ప్రకారం, అనేక దేశాలలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, అరుదైన పక్షుల కేటగిరీలో చేరాయి. వాటి సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం పురుగుమందుల వాడకం అని పరిశోధనలు వెల్లడించాయి. పంటలపై వాడే రసాయనాలు ఆహార గొలుసు ద్వారా ఈ పక్షులను ప్రభావితం చేసి, వాటి సంతానోత్పత్తి, మనుగడకు ఆటంకం కలిగిస్తున్నాయి. అయితే పెరెగ్రైన్ ఫాల్కన్ వంటి అరుదైన పక్షులను సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత.