Mossad: మొస్సాద్ టార్గెట్ చేస్తే ఖతమే.. ఇరాన్ టాప్ కమాండర్ హతం
Mossad: ఇజ్రాయెల్ అంతం చేసిన ఇరాన్ టాప్ కమాండర్ పేరు హుస్సేన్ మహమూద్ మర్షద్ అల్ జవహరి. యూనిట్ 840లో కీలక బాధ్యతల్లో ఉన్నాడు.
Mossad
ఇజ్రాయెల్ టాప్ స్పై ఏజెన్సీ మొస్సాద్ (Mossad)మరోసారి తన స్టామినా నిరూపించుకుంది. ఈ సంస్థ ఒక మిషన్ ను మొదలుపెట్టిందంటే దానిని విజయవంతంగా ముగించేవరకూ వెనక్కి తగ్గేదే లేదు. తమ శత్రువు ఎక్కడ దాక్కొన్నా వెతికి, వేటాడి అంతం చేయడంలో మొస్సాద్(Mossad) కు తిరుగేలేదు. విదేశాల్లో ఏజెంట్లను మోహరించి రహస్యాలు రాబట్టడంలో మొస్సాద్(Mossad) తర్వాతే అనేది ఎవ్వరైనా అని అంగీకరించాల్సిందే. తాజాగా అలాంటి ఆపరేషనే నిర్వహించి ఇరాన్ టాప్ కమాండర్ ను అంతమొందించింది.
ఇజ్రాయెల్ అంతం చేసిన ఇరాన్ టాప్ కమాండర్ పేరు హుస్సేన్ మహమూద్ మర్షద్ అల్ జవహరి. యూనిట్ 840లో కీలక బాధ్యతల్లో ఉన్నాడు. ఈ యూనిట్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగిన అనేక తీవ్రవాద కార్యక్రమాల వెనుక ఉంది.. వాటన్నింటిలో హస్సేన్ మహమూద్ కీలకంగా వ్యవహరించాడు. లిబియా-సిరియా సరిహద్దు ప్రాంతం నుంచి తన వ్యూహాలను అమలు చేసాడు.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు దొరకడంతోనే ఇజ్రాయిల్ అతన్ని మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా హుస్సేన్ మహమూద్ ఓ వాహనంలో వెళుతున్నట్లు పసిగట్టిన ఇజ్రాయెల్ దళాలు డ్రోన్‌తో దాడి చేయగా… అతను అక్కడికక్కడే మరణించాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయిల్ విడుదల చేసింది.

యూనిట్-840ని పూర్తిగా దెబ్బతీసేందుకు కూడా ఇజ్రాయిల్ వ్యూహాత్మక దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యూనిట్‌కి ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉంది. యూరోప్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించారు. చాలా దేశాల్లో స్థానికంగా ఉండే క్రిమినల్ ముఠాలను ఉపయోగించుకుని శత్రువులపై దాడులు చేయించడంలో దిట్టగా పేరుంది. తద్వారా అంతర్జాతీయంగా ఇరాన్‌పై నేరుగా ఆరోపణలు రాకుండా తప్పించుకోవడమే ఈ వ్యూహంలో భాగం. 2012లో భారత రాజధాని ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి వెనుక ఈ యూనిట్ 840 ఉందని చెబుతారు.
కాగా హుస్సేన్ మహమూద్ వంటి కీలక కమాండర్ ను అంతమొందించడంతో మరోసారి ఇజ్రాయిల్ పైచేయి సాధించిందని చెప్పొచ్చు. అతను చనిపోవడం యూనిట్ 840 కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు భావిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఇజ్రాయెల్, పాలస్తీనా పోరులో ఎంతమంది చనిపోతున్నా… ఎన్ని దేశాల నుంచి హెచ్చరికలు వచ్చినా మొస్సాద్ (Mossad)మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంటూ దూసుకెళుతోంది.



