Donald Trump: ట్రంప్ కు నిరసనల సెగ… నో కింగ్స్ నినాదంతో ఆందోళనలు
Donald Trump: నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను మోహరించడం వారిని మరింతగా రెచ్చగొట్టింది.

Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్(Donald Trump) ను ఎందుకు గెలిపించామా అనుకుంటున్నారు అక్కడి ప్రజలు.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనప్పటికీ… రెండోసారి ప్రెసిడెంట్ గా గెలిచినప్పటకీ తేడా చాలా కనిపిస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇప్పుడు నియంతలా వ్యవహరిస్తున్నాడని అమెరికా ప్రజలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలీదనీ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాడంటూ మెజార్టీ ప్రజలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. వలస విధానంతో మొదలైన ట్రంప్ నియంతృత్వం… తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్డౌన్, విద్య వంటి వాటిలోకి వచ్చింది.

దీంతో అతని విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు రోడెక్కారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన వేలాది మంది నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రజల నిరసనలతో పలు ప్రధాన నగరాలు అట్టుడుకిపోతున్నాయి.
నో కింగ్స్ పేరుతో జరుగుతున్న ఈ నిరసనలు చూస్తుండగానే పలు ప్రాంతాలకు పాకేసినట్టు తెలుస్తోంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజెల్స్ వంటి ప్రాంతాల్లో నిరసనలన్నీ శాంతియుతంగానే జరుగుతున్నాయి. న్యూయార్క్ లో లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారని అక్కడి పోలీసులు అధికారులు చెబుతున్నారు. మొత్తం 50 నగరాల్లో నిరసనకారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
నిరసనకారుల ప్రసంగాల్లో ట్రంప్(Donald Trump) ను దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఊహించినట్టుగానే ఈ నిరసనలకు డెమోక్రాట్లతోపాటు పలు సంఘాలు, సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఆందోళనకారులు తమ నిరసనలను శాంతియుతంగానే ప్రదర్శించాలని కోరుతున్నారు.

అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ నిరసనలపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. వైట్హౌస్తోపాటు రిపబ్లికన్ పార్టీ వీటిని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేశాయి. వీటిని హేట్ అమెరికా నిరసనలుగా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఆందోళనకారులపై మండిపడ్డారు.
నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను మోహరించడం వారిని మరింతగా రెచ్చగొట్టింది. దీనికి రియాక్షన్ గా నిరసనల్లో పాల్గొనేవారి సంఖ్య పెరిగిపోయింది. రాజు తరహాలో నియంతలా వ్యవహరిస్తున్న ట్రంప్ పై తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు.