Bangladesh :బంగ్లా రాజకీయాల్లో ‘డార్క్ ప్రిన్స్’ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టయిందా?
Bangladesh :6,314 రోజుల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టానంటూ తారిక్ రహమాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bangladesh
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుమారు 17 ఏళ్ల పాటు లండన్‌లో స్వీయ బహిష్కరణలో ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రహమాన్ మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు అయిన తారిక్ రాకతో ఢాకా వీధులు బీఎన్‌పీ కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి.
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల మధ్య తారిక్ రహమాన్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. 2008 నుంచి లండన్‌లోనే ఉంటూ పార్టీని నడిపిస్తున్న ఆయన, ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యారు.
6,314 రోజుల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టానంటూ తారిక్ రహమాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2007లో అవినీతి కేసుల్లో అరెస్టయి, జైలులో అనారోగ్యం పాలైన ఆయన, 2008లో చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయారు. తన భార్య డాక్టర్ జుబైదా, కుమార్తె జైమాతో కలిసి తాజాగా ఆయన ఢాకా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు సుమారు 50 లక్షల మంది మద్దతుదారులు నీరాజనాలు పట్టారు. ఒకప్పుడు ప్రత్యర్థులు ఆయనను “డార్క్ ప్రిన్స్” అని పిలిచినా..ఇప్పుడు ఆయనను తమ దేశాన్ని రక్షించే ప్రజాస్వామ్యవాదిగా బీఎన్‌పీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక అధికారంలోకి వచ్చిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం, భారత దేశంతో కంటే పాకిస్థాన్‌తో సత్సంబంధాలకే మొగ్గు చూపిస్తుంది. ఈ సమయంలో భారత్ వ్యతిరేక శక్తులు, ముఖ్యంగా ‘జమాత్-ఇ-ఇస్లామీ’ వంటి అతివాద సంస్థలు బంగ్లాలో మళ్లీ పట్టు సాధిస్తున్నాయి. పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI) కి తొత్తుగా వ్యవహరించే ఈ సంస్థలు భారత్‌పై విద్వేషాన్ని చిమ్ముతున్నాయి. ఇలాంటి సమయంలో తారిక్ రహమాన్ రాక భారత్‌కు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది.
దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తారిక్ రహమాన్ జమాత్-ఇ-ఇస్లామీ వంటి అతివాద సంస్థలతో స్నేహానికి సుముఖంగా లేరు. ఆ సంస్థల ప్రభావం పెరిగితే దేశ సార్వభౌమత్వానికి ముప్పని ఆయన భావిస్తున్నారు. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశమే.

అలాగే బీఎన్‌పీని భారత్ ఒక ఉదారవాద పార్టీగా చూస్తోంది. ఈమధ్య ఖలీదా జియా అనారోగ్యంపై ప్రధాని మోదీ స్పందించడం, దానికి బీఎన్‌పీ సానుకూలంగా బదులివ్వడం రెండు పక్షాల మధ్య మంచు కరుగుతోందని సూచిస్తున్నాయి.
అంతేకాదు తారిక్ రహమాన్ ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ నినాదాన్ని ఎత్తుకున్నారు. యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను తారిక్ రహమాన్ ప్రశ్నిస్తున్నారు. దీంతోనే బీఎన్‌పీ అధికారంలోకి వస్తే భారత్‌తో సంబంధాలు మళ్లీ గాడిలో పడతాయని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2026 ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖలీదా జియా అనారోగ్యం వల్ల తారిక్ రహమాన్ పీఎం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన బొగురా-6 నియోజకవర్గం నుండి బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. యువతలో తారిక్ రహమాన్ కున్న ఆదరణ బీఎన్‌పీకి పెద్ద బలం. అయితే, రహమాన్ రాకను జమాత్ వంటి శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఢాకాలో ప్రస్తుతం హైఅలర్ట్ ప్రకటించారు. బీఎన్‌పీ, అతివాద శక్తుల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని భద్రతా దళాలు హెచ్చరిస్తున్నాయి.
బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై దాడులు, భారత వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతుండటంతో..తారిక్ రహమాన్ నాయకత్వంలోని బీఎన్‌పీ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా అవతరిస్తుందని భారత్ ఆశిస్తోంది. పొరుగు దేశంలో ప్రజాస్వామ్యయుతమైన, భారత్ పట్ల సానుకూలమైన ప్రభుత్వం ఉండటం మన ప్రాంతీయ భద్రతకు అత్యంత అవసరం. తారిక్ రహమాన్ సెకండ్ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ భవిష్యత్తును ఏ దిశగా మారుస్తుందో వేచి చూడాలి.



