Trump : షట్‌డౌన్ దెబ్బ.. అమెరికా అబ్బా.. 62 వేల కోట్ల సంపద ఆవిరి
Trump : కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడలం లేదు. ఈ కారణంగానే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లి ఇప్పటికే 31 రోజులు పూర్తి చేసుకుంది.
Trump
డొనాల్డ్ ట్రంప్(Trump)రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదో ఒకరూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సొంత ప్రజల వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. పక్క దేశాల విషయాల్లో జోక్యం చేసుకుంటూ నానా హడావిడి చేస్తున్నారు. సుంకాల పెంపు నిర్ణయాలతో పలు దేశాలతో స్నేహాన్ని చెడగొట్టుకుంటున్నారు.అదే సమయంలో తమ ప్రభుత్వంలోని పరిస్థితులనూ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారు. దీనికి తాజా ఉదాహరణ షట్‌డౌన్… అక్కడి రాజకీయ నాయకుల మొండితనంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతోంది.
కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడలం లేదు. ఈ కారణంగానే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లి ఇప్పటికే 31 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో అగ్రరాజ్యం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. తాజా నివేదికల ప్రకారం ఈ షట్‌డౌన్ దెబ్బకు 7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.62 వేలకోట్లు) సంపద ఆవిరైపోయింది. గతంలోఎన్నడూ లేని విధంగా ఆర్థిక నష్టంగా చెబుతున్నారు. ఈ షట్‌డౌన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం 8 వారాలకు 14 మిలియన్ డాలర్లు అంటే 1 లక్షా 24 వేల కోట్ల కంటే ఎక్కువ సంపదను నష్టపోవాల్సి ఉంటుంది.

తాజా పరిణామాలపై అక్కడి ఆర్థిక ప్రముఖులు, విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షట్‌డౌన్ ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ముప్పు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు,. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉందని గుర్తు చేస్తున్నారు. అలాగే అమెరికా ఆర్థిక వృద్ధిలో క్రమంగా పాయింట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. తాజా పరిణామాలతో పలు సంస్థలు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. అటు ఏఐ ప్రభావంతో ఉద్యోగాల్లోనూ కోత క్రమంగా పెరుగుతుండడం కూడా ఆందోళనకరమైన అంశంగా మారింది.
ప్రస్తుత షట్ డౌన్ ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. చాలా బిల్లుల విషయంలో అక్కడి సభ్యుల మధ్య కొంచెం కూడా రాజీ పడే పరిస్థితి అస్సలు లేదు. దీంతో తాజా షట్ డౌన్ గత రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతబడగా…డొనాల్డ్ ట్రంప్(Trump) అధ్యక్షుడిగా ఉన్న 2018-19 మధ్య 35 రోజుల పాటు షట్ డౌన్ అయింది. అమెరికా దేశ చరిత్రలో అదే సుదీర్ఘ షట్‌డౌన్. ఇప్పుడు ఆ రికార్డు దాటేందుకు మరో 4 రోజులే మిగిలుంది.




One Comment