Trump : ట్రంప్ ‘టాప్’ గేర్.. భారత్‌కు భారీ షాక్
Trump : ట్రంప్ మానసిక స్థితి, ఆయన 'అమెరికా ఫస్ట్' విధానం ఈ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తాయి.

Trump : అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), మరోసారి తన ధోరణిని చాటుకున్నారు. అగ్రరాజ్య విధానాలు తన చేతిలో ఉన్నాయన్నట్లు, భారత వస్తువులపై ఏకంగా 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. భారత్ తమకు మిత్రదేశమే అయినా, గతంలో భారత్ విధించిన అధిక సుంకాల కారణంగానే ఇన్నేళ్లలో అమెరికాతో వాణిజ్యం అనుకున్నంతగా జరగలేదని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానంలో ఒక భాగంగానే విశ్లేషకులు చూస్తున్నారు.
Trump
ట్రంప్ ఈ నిర్ణయానికి ప్రధానంగా రెండు కారణాలను చూపించారు. ఒకటి: భారత్ తమ వస్తువులపై అధిక సుంకాలు విధించడం. రెండు: రష్యాతో భారత్ కొనసాగిస్తున్న వాణిజ్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ ఉందని, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు జరుగుతున్నా భారత్ కొనుగోళ్లను కొనసాగించడం ఏ మాత్రం సరికాదని ట్రంప్ తన పోస్ట్‌లో ధ్వజమెత్తారు. “ఇది మంచిది కాదు” అని స్పష్టం చేస్తూ, దీని కారణంగానే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై (India Exports)25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు, రష్యాతో వాణిజ్యం కారణంగా భారత్‌కు పెనాల్టీ కూడా విధించనున్నట్లు ట్రంప్ తన పోస్ట్‌లో ఘాటుగా హెచ్చరించారు.
ఈ ప్రకటన భారత్‌కు ఊహించని షాక్. ఎందుకంటే, ఆగస్టు 1కి ముందే ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరాలని చర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెల యూఎస్ బృందం భారత్‌కు రానుంది. కీలక చర్చలకు ముందు ట్రంప్ ఈ బాంబు పేల్చడం వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చాక వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు, ఆపై ఒప్పందాల కోసం గడువులు పొడిగించారు. ఇప్పుడు ఆ గడువు సమీపిస్తుండగానే భారత్‌పై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
వాణిజ్య గణాంకాలు చూస్తే, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 22.8 శాతం పెరిగి $25.51 బిలియన్లకు చేరాయి. దిగుమతులు కూడా 11.68 శాతం పెరిగాయి. వ్యాపారం పెరుగుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై, ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫార్మా, ఆటో విడిభాగాలపై ప్రభావం చూపనుంది. భారత్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ ‘టారిఫ్ వార్’ ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.
మొత్తంగా ట్రంప్ మానసిక స్థితి, ఆయన ‘అమెరికా ఫస్ట్’ విధానం ఈ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన దృష్టిలో, ఏ దేశమైనా అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అది శత్రు దేశమైనా, మిత్రదేశమైనా సరే. ఇది కేవలం వాణిజ్య నిర్ణయం కాదని, ఒక రాజకీయ హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు.