Nighty: రోజంతా నైటీలోనే ఉంటున్నారా? బొజ్జ పెరగడానికి నైటీలు కారణమా?
Nighty:రోజంతా నైటీలోనే ఉండటం వల్ల మెదడుకు మనం ఇంకా విశ్రాంతి మోడ్‌లోనే ఉన్నామనే సంకేతం వెళ్తుంది.
Nighty
చాలా మంది మహిళలు ఫ్రీగా ఉంటుందని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నైటీలోనే గడిపేస్తుంటారు. సౌకర్యంగా ఉంటుందని, పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నైటీ(Nighty)లను ఎంచుకుంటారు. అయితే, ఇలా 24/7 వదులుగా ఉండే నైటీలు వేసుకోవడం వల్ల శరీర ఆకృతిపై ప్రభావం పడుతుందని, ముఖ్యంగా పొట్ట పెరుగుతుందని సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతుంటాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు , డాక్టర్ల అభిప్రాయం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
నైటీల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ఇవి బ్రిటీష్ కాలం నాటివని తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లో విక్టోరియా రాణి పాలనలో రాజవంశీయులు, ధనిక వర్గాల మహిళలు రాత్రి పూట పడుకునేటప్పుడు వదులుగా ఉండే పొడవాటి గౌనులను ధరించేవారు. వీటినే ‘నైట్ గౌన్’ లేదా ‘నైటీ’ అని పిలిచేవారు. అప్పట్లో ఇవి కేవలం తెల్లటి రంగులో, లేస్ వర్క్ తో చాలా ఖరీదైనవిగా ఉండేవి. భారతదేశానికి బ్రిటీష్ అధికారులు వచ్చినప్పుడు, వారి భార్యలు ఈ నైటీలను ధరించడం చూసి మన దగ్గర ఉన్న ధనిక వర్గాల మహిళలు కూడా వీటిని అలవాటు చేసుకున్నారు.
నైటీ(Nighty)లలో సాగే గుణం ,కంఫర్ట్ ట్రాప్ ..మనం జీన్స్ లేదా చుడీదార్ లాంటి ఫిట్టింగ్ బట్టలు వేసుకున్నప్పుడు, మన పొట్ట కొంచెం పెరిగినా లేదా మనం ఎక్కువ ఆహారం తీసుకున్నా ఆ బట్టలు బిగుతుగా అనిపిస్తాయి. దీనివల్ల మనకు ఒక రకమైన సిగ్నల్ అందుతుంది. అంటే మనం లావు అవుతున్నాం లేదా ఎక్కువ తింటున్నాం అని మనం అప్రమత్తం అవుతాం. కానీ నైటీలు చాలా వదులుగా ఉంటాయి. మన పొట్ట ఎంత పెరుగుతున్నా నైటీలు ఇబ్బంది పెట్టవు. దీనివల్ల మనం శరీరంలో వచ్చే మార్పులను సకాలంలో గమనించలేం. గమనించేలోపు బొజ్జ సైజు పెరిగిపోతుంది.

కండరాల పట్టు , బిగుతు దుస్తులపై అపోహలు..చాలా మంది బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే పొట్ట కండరాలు బిగుతుగా ఉంటాయని, నైటీలు వేసుకుంటే కండరాలు వదులై పొట్ట వస్తుందని భావిస్తారు. కానీ డాక్టర్ల అభిప్రాయం ప్రకారం ఇది నిజం కాదు. దుస్తులు కండరాలను నియంత్రించలేవు. కండరాల పటుత్వం అనేది కేవలం మనం చేసే వ్యాయామం, శారీరక శ్రమ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నైటీ వేసుకోవడం వల్ల కండరాలు వదులవుతాయని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వదులుగా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు మన బాడీ పోశ్చర్ పట్ల మనం కాస్త అశ్రద్ధగా ఉండే అవకాశం ఉంది.
ఆహార నియంత్రణ లేకపోవడం..ఫిట్టింగ్ బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తినగానే కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనివల్ల మనం తినడం ఆపేస్తాం. కానీ నైటీలో ఎంత తిన్నా ఆ టైట్ ఫీలింగ్ రాదు. దీనివల్ల మనం తెలియకుండానే మన కడుపు సామర్థ్యం కంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటాం. ఈ అదనపు కేలరీలే పొట్ట చుట్టూ కొవ్వుగా పేరుకుపోతాయి.
సైకలాజికల్ బద్ధకం..నిజానికి నైటీ అనేది విశ్రాంతికి సంకేతం. రోజంతా నైటీలోనే ఉండటం వల్ల మెదడుకు మనం ఇంకా విశ్రాంతి మోడ్‌లోనే ఉన్నామనే సంకేతం వెళ్తుంది. దీనివల్ల చురుకుగా పనులు చేయాలనే ఉత్సాహం తగ్గి, బద్ధకం పెరుగుతుంది. చిన్నచిన్న పనులకు బయటకు వెళదామనుకుని వాయిదా వేసేస్తుంటారు.దీనివల్ల శారీరక శ్రమ తగ్గడం వల్ల కూడా కెలరీలు ఖర్చు కావు, దీంతో పొట్ట పెరుగుతుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కేవలం బట్టలు మార్చడం మాత్రమే కాదు, సరైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
అందుకే నిద్రపోయే సమయంలో నైటీ (Nighty)ధరించడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. అయితే పగలు పూట పనుల సమయంలో కాస్త ఫిట్టింగ్ ఉండే బట్టలు వేసుకోవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులను మనం గమనించొచ్చు. ఇకపై రోజంతా నైటీలలో ఉండే మహిళలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



