Diabetic retinopathy: మధుమేహం చూపును ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?
Diabetic retinopathy: మధుమేహులకు చూపు కోల్పోయే ప్రమాదం: రెటినోపతిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు

Diabetic retinopathy
మధుమేహం (Diabetic )అనేది ఒక పెద్ద ఆరోగ్య సమస్య. దీనిని నియంత్రించకపోతే అది శరీరంలోని అన్ని అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. గుండె, కిడ్నీలు, కాళ్లతో పాటు కంటి చూపును కూడా దెబ్బతీస్తుంది. చాలామంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల, నడివయసులోనే చూపు కోల్పోయి అంధత్వంలోకి వెళ్తున్నారు. మధుమేహాన్ని సరిగా నియంత్రించుకోకపోతే దాని దుష్ప్రభావం కంటిలోని సున్నితమైన రెటీనా పొరపై పడుతుంది. రెటీనా ఒకసారి దెబ్బతినడం మొదలైతే, దాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదంటున్నారు డాక్టర్లు.

మన కనుగుడ్డులో వెనక ఉండే సున్నితమైన పొర రెటీనా. ఇది మనం చూసే వస్తువుల ప్రతిబింబాన్ని మెదడుకు పంపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ గ్లూకోజ్ రక్తనాళాల ద్వారా ప్రవహించడం వల్ల, రెటీనాలోని సన్నని రక్తకేశనాళికలు దెబ్బతింటాయి. అలాగే, అధిక గ్లూకోజ్ కారణంగా ఎర్ర రక్త కణాలు సరిగా ఆక్సిజన్‌ను సరఫరా చేయలేవు. దీనివల్ల రెటీనా పొర దెబ్బతినడం మొదలవుతుంది. ఈ సమస్యను డయాబెటిక్ రెటినోపతి అని అంటారు.

రెటినోపతి (Diabetic retinopathy) తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. చూపు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే సమస్య ముదిరిన తర్వాత అక్షరాలు వంకరగా కనిపించడం, పక్క పదం కనిపించకపోవడం వంటి సూక్ష్మమైన మార్పులు మొదలవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి, రెటీనా పరీక్ష చేయించుకోవాలి. రెటినోపతిలో రెండు ప్రధాన దశలు ఉన్నాయి:
తొలి దశ (నాన్-ప్రోలిఫరేటివ్): ఈ దశలో కేశనాళికల గోడలు ఉబ్బుతాయి. వాటి నుంచి కొవ్వులు, ద్రవాలు రెటీనా మధ్యభాగం (మాక్యులా) మీద లీక్ అయి వాపు వస్తుంది. దీనివల్ల చూపు క్రమంగా తగ్గుతుంది.
మలి దశ (ప్రోలిఫరేటివ్): ఇది చాలా తీవ్రమైన దశ. ఈ దశలో రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో కొత్తగా, బలహీనమైన రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి చిట్లి రక్తస్రావం జరిగి ఒక్కసారిగా చూపు పోయే ప్రమాదం ఉంది.
రెటినోపతి సమస్య ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ఫండస్ ఎగ్జామినేషన్, ఫ్లోరొసిన్ యాంజియోగ్రఫీ, ఓసీటీ (ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ) వంటి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ఆధారంగా చికిత్స నిర్ణయిస్తారు.
- లేజర్ చికిత్స: లీకేజీలు, వాపు ఉన్నప్పుడు లేజర్‌తో ఆ ప్రాంతాన్ని మాడ్చి సమస్యను అదుపులో ఉంచుతారు.
- యాంటీ-వీఈజీఎఫ్ ఇంజెక్షన్లు: కొత్త రక్తనాళాలు పుట్టకుండా నిరోధించడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తారు.
- విట్రెక్టమీ శస్త్రచికిత్స: కంటిలో రక్తస్రావం అయినప్పుడు, ఆ రక్తాన్ని తొలగించడానికి ఈ శస్త్రచికిత్స చేస్తారు.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ చికిత్సలు సమస్య మరింత ముదరకుండా చూడటానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ పోయిన చూపును పూర్తిగా తిరిగి తీసుకురాలేవు. అందుకే మధుమేహం ఉన్నవారు జీవితాంతం మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకుంటూ, తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే చూపు ఎప్పుడైనా ప్రమాదంలో పడొచ్చు.
One Comment