Wooden comb: చెక్క దువ్వెన వాడితే ఎన్ని లాభాలుంటాయో తెలుసా? జుట్టు ఆరోగ్యం వెనుక సైన్స్ కూడా!
Wooden comb: ప్లాస్టిక్, మెటల్ దువ్వెనలు జుట్టుపై, స్కాల్ఫ్‌పై చాలా కఠినంగా ఉంటాయి. వీటి వాడకం ద్వారా తలకు హాని కలిగించే చుండ్రు (Dandruff) సమస్యలు మరింత పెరుగుతాయి.

Wooden comb
సాధారణంగా మనందరం ఇంట్లో ప్లాస్టిక్ లేదా మెటల్ దువ్వెనలు వాడుతుంటాం. కానీ ఒకప్పుడు వీటి స్థానంలో పూర్తిగా చెక్కతో చేసిన దువ్వెన(Wooden comb)లే వాడేవారు. నిజానికి, ప్లాస్టిక్ దువ్వెనల కంటే చెక్క దువ్వెనలు వాడటమే మంచిదని ఆరోగ్య నిపుణులు, జుట్టు సంరక్షణ నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఈ చెక్క దువ్వెనలు మన జుట్టుకు, తలకు సంబంధించిన చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
ప్లాస్టిక్, మెటల్ దువ్వెనలు జుట్టుపై, స్కాల్ఫ్‌పై చాలా కఠినంగా ఉంటాయి. వీటి వాడకం ద్వారా తలకు హాని కలిగించే చుండ్రు (Dandruff) సమస్యలు మరింత పెరుగుతాయి. కానీ చెక్క దువ్వెన జుట్టుపై చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది స్థిర విద్యుత్తును (Static Electricity) ఉత్పత్తి చేయదు. ఈ చెక్క దువ్వెనలతో దువ్వుకోవడం వల్ల తలపై ఉన్న నూనె ఉత్పత్తి (Sebum) సమతుల్యం అవుతుంది. ప్లాస్టిక్ దువ్వెనలు వాడటం ద్వారా నూనె ఒక చోటే పేరుకుపోతుంది. కానీ చెక్క దువ్వెన ఆ నూనెను కుదుళ్ల నుంచి జుట్టు కొనల వరకు సమానంగా పంచుతుంది. దీని కారణంగా చర్మం పొడిబారకుండా, సహజంగా చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

చిక్కులు పడ్డ జుట్టును విడదీయడంలో ప్లాస్టిక్ దువ్వెనలు చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. వాటి పళ్ళు పదునుగా ఉండి, జుట్టు చిక్కును విడదీయడానికి బదులు.. జుట్టు చిట్లిపోవడం, తెగిపోవడం లేదా కుదుళ్ల నుంచి బలంగా రాలిపోవడం జరుగుతుంది. కానీ చెక్క దువ్వెనలు ప్లాస్టిక్ కంటే మందంగా, మరియు నునుపుగా ఉండటం వల్ల చాలా సులువుగా చిక్కులను విడదీస్తాయి. వీటి వాడకం వల్ల జుట్టు తెగిపోయే సమస్య చాలా వరకు తగ్గి, జుట్టు రాలడాన్ని గణనీయంగా నియంత్రిస్తుంది.
సాధారణంగా చాలా మందికి స్కాల్ఫ్‌పై జిడ్డు (Oily Scalp) ఉంటుంది. ఇది జుట్టును అందవిహీనంగా, మరియు మురికిగా కనిపించేలా చేస్తుంది. సెబాషియస్ గ్రంథులు ఉత్పత్తి చేసే సెబమ్ అనే ద్రవంతో తలలో ఈ జిడ్డు ఏర్పడుతుంది. చెక్క దువ్వెనలు ఈ ద్రవాల ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి. చెక్క, సహజమైన పీల్చుకునే గుణం కలిగి ఉండటం వల్ల, అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీంతో స్కాల్ఫ్‌పై జిడ్డు ఏర్పడకుండా, కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
చెక్క దువ్వెన(Wooden comb)లు స్కాల్ఫ్ మీద మసాజ్ చేసిన అనుభూతిని కలిగిస్తాయి. ఇవి కార్బన్ ఆధారితంగా తయారవుతాయి. వీటితో దువ్వుకోవడం ద్వారా తలలోని రక్త ప్రసరణ (Blood Circulation) బాగా జరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ జుట్టు నాణ్యతను పెంచడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ సున్నితమైన మసాజ్ ప్రభావం వల్ల తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతపరుస్తుంది.