Dog bite : వీధి కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..?
Dog bite : సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రాణాంతకమైన రేబిస్ (Rabies) వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది.

Dog bite: కుక్కను చూస్తే కొంతమందికి భయం, మరికొంతమందికి ప్రేమ. అయితే కుక్క కాటు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఎందుకంటే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రాణాంతకమైన రేబిస్ (Rabies) వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ భయంకరమైన వ్యాధిని ఎలా నివారించాలి? కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? రేబిస్ లక్షణాలు ఏమిటి? ఈ కీలక విషయాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.
What to do immediately after a dog bite..
రేబిస్ అనేది రేబిస్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ముఖ్యంగా రేబిస్ సోకిన కుక్కల లాలాజలం (Saliva)లో ఉంటుంది. టీకాలు వేయించని కుక్కలు మనుషులను కరిచినా, లేదా చర్మంపై గాయాలు ఉన్న చోట నాకినా, వాటి లాలాజలం ద్వారా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి వైరస్ శరీరంలోకి చేరితే, అది నెమ్మదిగా నాడీ మండలానికి (Nervous system) చేరుకొని, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది చివరికి ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
కుక్క కరిచినప్పుడు కంగారుపడకుండా, తక్షణమే కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. కరిచిన చోట గాయాన్ని వెంటనే, వీలైనంత త్వరగా, పారుతున్న నీటి కింద కనీసం 10-15 నిమిషాల పాటు సబ్బుతో పూర్తిగా కడగాలి. ఇది వైరస్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
గాయాన్ని నేరుగా చేతితో తాకకుండా, వీలైతే గ్లౌజులు ధరించి శుభ్రం చేయండి. గాయాన్ని పొడిగా తుడిచి, ఆ తర్వాత వెంటనే యాంటీసెప్టిక్ లోషన్ (ఉదాహరణకు, పోవిడోన్-అయోడిన్) రాయాలి. ఈ ప్రథమ చికిత్స పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించి, యాంటీ-రేబిస్ టీకాలు తీసుకోవడం అత్యవసరం. చర్మంపై ఎటువంటి గాయాలు లేని చోట కుక్క నాకినప్పటికీ, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కోవడం మంచిది.
కుక్క కరిచిన 7 నుంచి 10 రోజుల్లో రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవ్వొచ్చు, అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ఇది నెలలు కూడా పట్టవచ్చు. లక్షణాలు బయటపడిన తర్వాత చికిత్స చాలా సంక్లిష్టంగా మారుతుంది, అందుకే ముందస్తుగా టీకా తీసుకోవడం చాలా ముఖ్యం.
బాధితులు విపరీతమైన అలసటతో, జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో బాధపడతారు.కరిచిన చోట మంట, దురద, జలదరింపులు, నొప్పి లేదా తిమ్మిరి వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి. రేబిస్ వ్యాధిలో కనిపించే అత్యంత విలక్షణమైన లక్షణం ఇది. రోగులు నీటిని చూసినా లేదా తాగడానికి ప్రయత్నించినా తీవ్రమైన భయానికి లోనవుతారు. దగ్గు, గందరగోళం (confusion), గొంతు మంట, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
రేబిస్ అనేది 100% నివారించదగినదే కానీ.. 100% ప్రాణాంతకమైన వ్యాధి కూడా. అందుకే.. కుక్క కరిచిన వెంటనే సరైన ప్రథమ చికిత్స చేసి, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి యాంటీ-రేబిస్ టీకాలు తీసుకోవడమే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ఏకైక మార్గం. మీ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించండి.