water: మీకు తెలుసా ..అతిగా నీరు తాగితే.. నిశ్శబ్దంగా ప్రాణం తీస్తుందట
water : మంచినీళ్లు తాగడం ఎంత ముఖ్యమో, వాటిని ఎంత మోతాదులో తాగాలనేది కూడా అంతే కీలకం.

water : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ సరిపడా నీరు తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయని డాక్టర్లు చెబుతారు. అయితే, మంచినీళ్లు తాగడం ఎంత ముఖ్యమో, వాటిని ఎంత మోతాదులో తాగాలనేది కూడా అంతే కీలకం. అవసరాన్ని మించి నీళ్లు తాగినా శరీరానికి హాని జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నట్లు, నీరు విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది.
water
ఒక మనిషి రోజులో ఎంత నీరు(water) తాగాలనేది వారి శరీర తత్వం, వయసు, శారీరక శ్రమ వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్(Dehydration) వస్తుంది. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే, శరీరం తగిన దానికంటే ఎక్కువ నీరు గ్రహిస్తే దానిని ఓవర్‌హైడ్రేషన్ అంటారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఓవర్‌హైడ్రేషన్(Overhydration) జరిగినప్పుడు మూత్రపిండాలు అధిక నీటిని శరీరంలోనే నిలుపుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల రక్తంలోని సోడియం స్థాయిలు పడిపోయి, ఎలక్ట్రోలైట్స్ పలచబడతాయి. ఇది శరీర జీవక్రియలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది.
నిజానికి, శరీర కణాలకు ఆక్సిజన్, పోషకాలను అందించడంలో, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, అదనపు అనవసరమైన పదార్థాలను తొలగించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మూత్రపిండాలు, కాలేయంపై ఒత్తిడిని తగ్గించి, కణాలను తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరంలోని అవాంఛిత పదార్థాలు, అదనపు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అయితే, ఈ ప్రక్రియ సక్రమంగా జరగనప్పుడు లేదా ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు సమస్య మొదలవుతుంది.
శరీరంలో ఎక్కువ నీరు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభంలో వికారం, తలనొప్పి, కండరాల ఉద్రిక్తత, మైకం, తీవ్రమైన మగతగా అనిపించడం వంటివి గమనించవచ్చు. కొన్నిసార్లు ఈ ప్రారంభ సంకేతాలను గుర్తించడం కష్టం కావచ్చు. శరీరం నిలుపుకొన్న ఎక్కువ నీరు కాళ్లు, చేతులు వంటి శరీర భాగాలలో వాపునకు కారణమవుతుంది, ఇది ఒక స్పష్టమైన సంకేతం.
అలాగే ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇది మెదడు కణాల వాపునకు, నాడీ వ్యవస్థ రుగ్మతల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మీరు ఎక్కువ నీరు తాగడం వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, అది ఒక ముందస్తు హెచ్చరికగా భావించాలి. ముఖ్యంగా మూత్రపిండాలు ఎక్కువ నీటిని నిల్వ చేయడం ప్రారంభించినప్పుడు కనిపించే లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సరైన మోతాదులో నీరు తాగడం ద్వారానే శరీరాన్ని ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉంచుకోవచ్చు.