Kidney Stones: కిడ్నీలో రాళ్లు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? వాటిని ఇలా ఈజీగా కరిగించుకోండి..
Kidney Stones: ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల యువతలో కూడా కిడ్నీలో రాళ్లు సమస్య విపరీతంగా పెరిగిపోతోంది.
Kidney Stones
ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం ఎన్నో సమస్యలకు దారి తీస్తోంది. అందులో ముఖ్యమైనది కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం. ఇది ఒకప్పుడు కేవలం మధ్యవయస్కుల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల యువతలో కూడా ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతోంది.
అసలు కిడ్నీలో రాళ్లు (Kidney Stones)అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయనేది చాలామందికి తెలీదు. మన మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసేటపుడు శరీరంలోని అదనపు లవణాలను, ఖనిజాలను యూరిన్ ( మూత్రం) ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే మనం తగినంత నీళ్లు తాగనప్పుడు లేదా ఆహారంలో ఉప్పు, ఆక్సలేట్లు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ ఖనిజాలు గట్టిపడి స్ఫటికాలుగా మారుతాయి. అవే మెల్లగా కిడ్నీలో రాళ్లుగా మారతాయి. ఇవి చిన్న ఆవగింజ పరిమాణం నుంచి చిన్నసైజు గోలీ కాయంత వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు(Kidney Stones) ఉన్నప్పుడు ప్రారంభంలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. కానీ ఆ రాయి మూత్ర నాళంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం విపరీతమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి సాధారణంగా వెన్నుభాగంలో మొదలై పొత్తికడుపు వరకు వ్యాపిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, రక్తం పడటం, తరచుగా వికారం, వాంతులు రావడం వంటివి దీని ప్రధాన లక్షణాలుగా డాక్టర్లు చెబుతారు.
చాలామంది కిడ్నీలో రాళ్లు (Kidney Stones)అనగానే భయపడి ఆపరేషన్ చేయించుకోవడానికి వెళతారు. కానీ 5 ఎంఎం (5mm) కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లను మనం కొన్ని ఆహార నియమాలు, చిట్కాల ద్వారా ఈజీగా కరిగించుకోవచ్చట. దీనికి ప్రధానమైన మందు ఈజీ అయిన మందు కేవలం మంచి నీళ్లు. అవును రోజుకు కనీసం 3- 4 లీటర్ల మంచినీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలు ఎప్పటికప్పుడు శుభ్రపడుతూ రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

ఆహార విషయానికి వస్తే, కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు సిట్రస్ జాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం తాగడం వీరికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కాల్షియం రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుందట. అలాగే బార్లీ నీళ్లు , కొబ్బరి నీళ్లు కూడా మూత్రపిండాల్లోని వేడిని తగ్గించి, వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.
అలాగే ప్రకృతి సిద్ధంగా లభించే ‘అరటి దూట’ (Plantain Pith) జ్యూస్ కిడ్నీ రాళ్లను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రాళ్లను చిన్నచిన్న ముక్కలుగా చేసి మూత్రం ద్వారా పంపించేస్తుంది. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా టమోటాలు, పాలకూర కలిపి తినకూడదు. అలాగే చాక్లెట్లు , కూల్ డ్రింక్స్ (Soft Drinks) తీసుకోవడం తగ్గించాలి. వీటిలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రాళ్లు వేగంగా పెరుగుతాయి.
వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం మంచిది. రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. మాంసాహారం, ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మంచిది. అధిక బరువును తగ్గించుకోవడం వల్ల కూడా కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు వంటివి మితంగా తీసుకోవాలి. చాలామంది కాల్షియం తీసుకుంటే రాళ్లు వస్తాయని భ్రమపడతారు. కానీ సరైన మోతాదులో కాల్షియం తీసుకోవడం వల్ల శరీరంలోని ఆక్సలేట్లు తగ్గి రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.



