Finger:చేతి వేళ్లలో తిమ్మిరి , నొప్పా? నిర్లక్ష్యం చేయకండి..
Finger: ఎక్కువ సేపు కంప్యూటర్ కీబోర్డ్ వాడటం, మొబైల్ లో టైపింగ్ చేయడం లేదా గృహిణులు నిరంతరం పనులు చేయడం వల్ల మణికట్టుపై ఒత్తిడి పడుతుంది.
Finger
సాధారణంగా చాలా మంది చేతి వేళ్లు(Finger) తిమ్మిరి ఎక్కినట్లు అనిపిస్తున్నా దానిని తేలికగా తీసుకుంటారు. కానీ తిమ్మిరితో పాటు నొప్పి రావడం, వేళ్లను మడవడం లేదా చాపడం కష్టంగా మారితే మాత్రం అది చేతి నరాలపై ఒత్తిడి పడుతోందని చెప్పడానికి సంకేతం. ముఖ్యంగా బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలులో ఈ సమస్య ఎక్కువగా ఉంటే దానిని వైద్య భాషలో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (Carpal Tunnel Syndrome) అని పిలుస్తారు. మన మణికట్టు దగ్గర ఉండే నరం నలిగిపోవడం వల్ల ఈ తిమ్మిర్లు మొదలవుతాయని డాక్టర్లు చెబుతారు.
ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఒకే పనిని గంటల తరబడి కంటెన్యూగా చేయడం. ఉదాహరణకు ఎక్కువ సేపు కంప్యూటర్ కీబోర్డ్ వాడటం, మొబైల్ లో టైపింగ్ చేయడం లేదా గృహిణులు నిరంతరం పనులు చేయడం వల్ల మణికట్టుపై ఒత్తిడి పడుతుంది. దీనికి తోడు శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నా కూడా నరాలు బలహీనపడి చేతి వేలు(Finger) తిమ్మిర్లు వస్తాయి. కొన్నిసార్లు మెడ దగ్గర నరం నలిగినా (Cervical Spondylosis) ఆ ప్రభావం చేతి వేళ్లపై చూపిస్తుంది.

వేళ్ల తిమ్మిరి , నొప్పి తగ్గడానికి ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మొదటిది పని మధ్యలో విరామం ఇవ్వడం. ప్రతి అరగంటకు ఒకసారి చేతి వేళ్లను విదిలించడంతో పాటు మణికట్టును గుండ్రంగా తిప్పడం వంటి చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి, అందులో చేతులను కాసేపు ఉంచడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది. రాత్రి పడుకునేటప్పుడు చేతిని మడతపెట్టకుండా తిన్నగా ఉంచి పడుకోవాలి.
ఒకవేళ ఈ సమస్య తగ్గకుండా వేళ్లు మొద్దుబారిపోతున్న సమస్య ఎక్కువ అనిపిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించి ఒకసారి నరాల పరీక్ష (NCV Test) చేయించుకోవడం మంచిది. అలాగే విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా నరాలను బలంగా ఉంచుకోవచ్చు.



