Winter Season: ఈ శీతాకాలంలో మీ గుండె, చర్మాన్ని కాపాడుకోండి ఇలా!
Winter Season: చలి వల్ల దాహం వేయదు, దాంతో చాలామంది నీళ్లు తాగడం చాలావరకూ తగ్గిస్తారు.
Winter Season
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చలి పులి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో చాలామందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి కారంణం చలికాలం(Winter Season)లో మన రోగనిరోధక శక్తి కొంచెం తగ్గడమే. దీనివల్లే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు త్వరగా వస్తాయి.
ఈ సమయంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం కూడా ఉంది అదే హైడ్రేషన్. చలి వల్ల దాహం వేయదు, దాంతో చాలామంది నీళ్లు తాగడం చాలావరకూ తగ్గిస్తారు. ఇది చర్మం పొడిబారడానికి అలాగే జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల మంచి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
గోరువెచ్చటి నీళ్లు అయితే ఇంకా మంచిది. శరీర ఉష్ణోగ్రతను పెంచే అల్లం,వెల్లుల్లి, మిరియాలు వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

చలికాలంలో మరో తీవ్రమైన సమస్య కీళ్ల నొప్పులు. వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఎముకల మధ్య ఉండే ద్రవం గట్టిపడి కదలికలు కష్టమవుతుంటాయి. దీనికి చెక్ పెట్టడానికి రెగ్యులర్‌గా ,తప్పనిసరిగా వ్యాయామం చేయడం, కీళ్లకు నువ్వుల నూనెతో మసాజ్ చేయడం మంచిది.
ఇక వృద్ధులు , గుండె జబ్బులు ఉన్నవారు అయితే తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిది. చలి వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్తపోటు (BP) పెరిగే అవకాశం ఉంటుంది. హెవీ వ్యాయామాలు చేయకుండా ఉండటం కూడా మంచిది.
చర్మం విషయంలో పగుళ్లు రాకుండా ఉండటానికి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ రాయాలి. వేడి నీటి స్నానం కంటే గోరువెచ్చని నీరు చర్మానికి మేలు చేస్తుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలు..అపుడే చలికాలపు హాయిని మనం పూర్తిస్థాయిలో ఆస్వాదించగలం.



