Blood group: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..వీళ్లు ఎవరికైనా ఇవ్వొచ్చు!
Blood group: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. దానిని 'గోల్డెన్ బ్లడ్ గ్రూప్' అంటారు.

Blood group
రక్తదానం.. ప్రాణదానం అంటారు. కానీ, కొన్నిసార్లు రక్తాన్ని ఎక్కించాలంటే ఆ బ్లడ్ గ్రూపు(Blood group) దొరకడం ఒక సవాలుగా మారుతుంది. అలాంటిది ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. దానిని ‘గోల్డెన్ బ్లడ్ గ్రూప్’ అంటారు. బంగారమంత విలువైన ఈ రక్తం ఎందుకు అంత అరుదైనది, దాని ప్రత్యేకతలేమిటో చూద్దాం.
బ్లడ్ గ్రూపులు సాధారణంగా A, B, O వంటి ఆంగ్ల అక్షరాలతో పిలవబడతాయి. అయితే, ప్రపంచంలో అత్యంత అరుదైన రెండు రక్త వర్గాలను మాత్రం వాటిని గుర్తించిన ప్రదేశాల పేరుతో పిలుస్తారు. వాటిలో ఒకటి భారతదేశంలోని ముంబైలో కనుగొనబడిన బాంబే బ్లడ్ గ్రూప్, మరొకటి ఆస్ట్రేలియాలో కనుగొనబడిన గోల్డెన్ బ్లడ్ గ్రూప్. బాంబే బ్లడ్ గ్రూప్ 10,000 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది, కానీ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంతకంటే చాలా అరుదుగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
గోల్డెన్ బ్లడ్ గ్రూపు(Blood group)ను మొదటిసారిగా 1961లో ఆస్ట్రేలియాలో ఒక మహిళలో గుర్తించారు. అప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా కేవలం 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉన్నట్లు తేలింది. అందుకే ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. ఈ రక్తం ఉన్నవారికి అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు దాతలను కనుగొనడం చాలా కష్టమైన పని.

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని విశ్వ దాతలు అని పిలుస్తారు. వీరు ఎవరికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. ఎందుకంటే వారి ఎర్ర రక్త కణాల్లో Rh యాంటిజెన్ ఉండదు, దీనివల్ల పాజిటివ్, నెగిటివ్ రక్త వర్గాలతో సంబంధం లేకుండా ఎవరికైనా వారి రక్తాన్ని ఎక్కించవచ్చు. అయినప్పటికీ, ప్రపంచంలో చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ రక్తం ఉండటం వల్ల, రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలను గుర్తించడం లేదా దాతలను కనుగొనడం చాలా కష్టం. ఈ అరుదైన రక్తంపై పరిశోధనలు నిర్వహించడానికి శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు.