Nipah virus:నిఫా వైరస్‌పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన.. భారత్ నుంచి ప్రపంచానికి ముప్పెంత?
Nipah virus: విదేశీ ప్రయాణాలు లేదా వాణిజ్యంపై ఎటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌ఓ క్లారిటీ ఇచ్చింది.
Nipah virus
కొద్ది రోజులుగా బెంగాల్‌లో కలకలం రేపుతున్న నిఫా వైరస్ వ్యాప్తిపై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హాస్పిటల్‌లో పనిచేసు ఇద్దరికి నిఫా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే దీనివల్ల పొరుగు రాష్ట్రాలకు కానీ, ఇతర దేశాలకు కానీ ముప్పు పొంచి ఉందన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ఈ నిఫా వైరస్ (Nipah virus)వ్యాప్తి చెందే రిస్క్ చాలా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. అందుకే విదేశీ ప్రయాణాలు లేదా వాణిజ్యంపై ఎటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌ఓ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి ప్రజలు ఆందోళన చెందొద్దని కోరింది.
పశ్చిమబెంగాల్‌లోని బరాసత్ పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే 25 ఏళ్ల యువకుడు, యువతికి జనవరిలో మొదటి వారంలో నిఫా లక్షణాలు బయటపడ్డాయి. వీరిద్దరిలో కూడా నాడీ సంబంధిత సమస్యలు వేగంగా తలెత్తడంతో, జనవరి మొదటి వారంలోనే వారిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం వీరి పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ, డబ్ల్యూహెచ్‌ఓ నిశితంగా గమనిస్తున్నాయి. విశేషమేమిటంటే, నిఫా వైరస్ ఒకరి నుంచి మరొకరికి (Human to Human) సంక్రమిస్తుందనే బలమైన ఆధారాలేవీ ఇప్పటి వరకు లభించలేదని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు అన్నారు. కేవలం బాధితులతో డైరక్టుగా సంబంధం ఉన్న వారికి మాత్రమే ఈ ముప్పు ఉంటుందని, అది కూడా ప్రస్తుతం నియంత్రణలో ఉందని వివరించారు.

అయితే భారత్‌లో వెలుగు చూసిన నిఫా వైరస్(Nipah virus)తో ప్రపంచ దేశాలకు ముప్పు లేదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినంత మాత్రాన పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లను తినడం, అపరిశుభ్రమైన పరిసరాల్లో ఉండటం వంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
బెంగాల్‌లోని సదరు జిల్లాలో గతంలో కూడా నిఫా కేసులు నమోదైన చరిత్ర ఉండటంతో..స్థానిక ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య వర్గాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ భయాందోళనలు క్రియేట్ చేయకుండా, ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. మరోవైపు భారత్ ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కేంద్రం కూడా ప్రకటించింది.
Sharwanand:ఓటీటీలోకి సంక్రాంతి హంగామా ‘నారీ నారీ నడుమ మురారీ’.. స్ట్రీమింగ్ ఎక్కడ?



